4 August, 2026 | 2:04 PM

Breaking News

విమాన ప్రయాణీకుల భద్రతపై తీసుకుంటున్న చర్యలేంటీ?

04-08-2026 01:10 PM

రాజ్యసభలో ప్రశ్నించిన ఎంపీ రవిచంద్ర

మహబూబాబాద్,(విజయక్రాంతి): విమానాలలో సిబ్బంది క్రమశిక్షణ, ప్రయాణీకుల భద్రత, ప్రయాణీకులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో ప్రశ్నించారు. ఇందుకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ స్పందిస్తూ విమానాలు, ప్రయాణీకులు, ఆస్తుల భద్రతను నిర్థారించడం, విమానాల్లో క్రమశిక్షణ తదితర అంశాలకు సంబంధించి ప్రత్యేక విభాగాలతో పాటు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని పేర్కొన్నారు.

విమానాలలో క్రమశిక్షణ, ప్రయాణీకుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా, అవాంఛనీయ లేదా అల్లరి ప్రవర్తనను నియంత్రించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్, సెక్షన్-3, ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్, సిరీస్-ఎం, పార్ట్-6 కింద ‘హ్యాండ్లింగ్ ఆఫ్ అన్‌రూలీ, డిస్‌రప్టివ్ ప్యాసింజర్స్’ పేరుతో ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయని ఎంపీ రవిచంద్రకు మంత్రి మొహోల్ తెలిపారు.  ప్రత్యేక అవసరాలున్న ప్రయాణీకుల కోసం క్యాబిన్ సేఫ్టీ సర్క్యులర్-01/2016 ప్రకారం మార్గదర్శకాలు అమలులో ఉన్నాయని మంత్రి బదులిచ్చారు.

అలాగే, ప్రయాణీకుల నుంచి వచ్చే ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు  గాను తమ శాఖ 24 గంటల ‘ప్యాసింజర్ అసిస్టెన్స్’ కంట్రోల్ రూమ్‌ను అనుసంధానం చేసి విమానాల రాకపోకల సమయం,సామాన్ల భద్రత,వాటి చేరవేతలో తలెత్తిన సమస్యలు, రీఫండ్ అంశాలను డీజీసీఏ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విమానయాన సంస్థలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షిస్తున్నట్లు ఎంపీ రవిచంద్రకు ఇచ్చిన సమాధానంలో మంత్రి వెల్లడించారు.  అదనంగా, ప్రయాణీకుల ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం ఎయిర్ సేవా పోర్టల్, మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకు రావడం జరిగిందని మంత్రి మొహోల్ ఎంపీ వద్దిరాజుకు ఇచ్చిన సమాధానంలో వివరించారు.