1 March, 2026 | 2:40 AM

ఉత్కంఠను రేకెత్తించే మృత్యుంజయ్

01-03-2026 12:33 AM

శ్రీవిష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందిన మరో చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ ఈ సినిమాలో మరోసారి జంటగా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, పాటకు మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను స్టార్ హీరో ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన ఎన్టీఆర్.. ఉత్కంఠభరితంగా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఉందని చెప్పారు. తండ్రిని మిస్ అవుతున్న ఒక పిల్లవాడితో ఈ కథ ప్రారంభం అవుతున్నట్టు కనిపిస్తోంది.

మళ్లీ ట్రైలర్ చివర్లో ఆ పిల్లాడికి, హీరో కథకు కనెక్ట్ చేసిన తీరు ఆకట్టుకుంటోంది. హీరోకు మాత్రమే కనిపించే ఆ హంతకుడు.. పోలీసులకు ఎందుకు కనిపిం చడం లేదు? అసలు ఆ వ్యక్తి ఎవరు? నేరం ఎలా జరిగింది? ఈ సమస్యను హీరో ఎలా పరిష్కరిస్తాడు? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. మార్చి 6న థియేటర్లోకి రాబోతున్న ఈ చిత్రానికి సంగీతం: కాళభైరవ; సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్; ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్; ప్రొడక్షన్ డిజైన్: మనీషా ఏ దత్.