30-12-2025 06:59:19 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని శ్రీ గోదాదేవి సమేత శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం తెల్లవారుజామున స్వామివారికి జలాభిషేకం, పంచామృత స్నానం అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజాలు నిర్వహించారు. శ్రీ గోదాదేవి సమేత శ్రీ రంగనాయక స్వామి వారిని దర్శించుకునేందుకు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, తదితర జిల్లాల, సిర్పూర్ నియోజకవర్గం లోని వివిధ మండలాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
దీనితో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.అనంతరం హారతి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు. స్వామివారిని దర్శించుకున్న అధికారులు: ఎంపీడీవో బండారి ప్రవీణ్ కుమార్, ఎంపీ ఓ గాజుల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి, కార్యదర్శి వైకుంఠం, బెజ్జూర్ కస్తూర్బా గాంధీ ప్రిన్సిపల్ అరుణ, ఆయా శాఖల అధికారులు సైతం స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు తంగేడి పల్లి మహేష్, మాజీ అధ్యక్షులు రాచకొండ శ్రీ వర్ధన్, కొండ్రా జగ్గా గౌడ్, సుధాకర్ గౌడ్, కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.