9 August, 2026 | 10:03 AM

దరఖాస్తుల స్వీకరణ కౌంటర్లను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్

09-08-2026 08:29 AM

ఆదిలాబాద్, (విజయక్రాంతి) : అదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం నుంచి ప్రారంభమైన నూతన పెన్షన్ల ఆన్‌లైన్ ప్రక్రియతో పాటు దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లను మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ పట్టణంలోని 49 వార్డులకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి పది వార్డులకు ఒక ఆన్‌లైన్ కౌంటర్ చొప్పున మొత్తం ఐదు ఆన్‌లైన్ కౌంటర్లను ఏర్పాటు చేసి, దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను వార్డు అధికారులు పరిశీలించి, అర్హత ఉన్న లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారని తెలిపారు. వికలాంగుల పెన్షన్, వితంతు పెన్షన్, సింగిల్ ఉమెన్ పెన్షన్, బోధకాలు/బోదకాలు వ్యాధిగ్రస్తుల పెన్షన్, కిడ్నీ వ్యాధితో డయాలసిస్ పొందుతున్న వారికి సంబంధించిన పెన్షన్ కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.

అర్హులైన వారు తమ ఆధార్ కార్డు జిరాక్స్, ఆన్‌లైన్ రేషన్ కార్డు జిరాక్స్ , వికలాంగులు సదరం సర్టిఫికెట్, వితంతువులు డెత్ సర్టిఫికెట్, సింగిల్ ఉమెన్ లబ్ధిదారులు వార్డు అధికారులు విచారణ చేసి ధృవీకరించిన సర్టిఫికెట్, బోదకాలు, డయాలసిస్ రోగులు సంబంధిత ఆరోగ్యశ్రీ/రిమ్స్ అధికారులు జారీ చేసిన ధ్రువపత్రాలను సమర్పించాలని తెలిపారు. ఈ నెల 15న కొత్త పెన్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ అంతకుముందే మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలోని కౌంటర్లు, పరిసరాలను పరిశీలించిన చైర్‌పర్సన్.. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు, సిబ్బంది విధులకు గైర్హాజరైతే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్‌ఓ కల్యాణ్, ఆర్‌ఐలు, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.