9 August, 2026 | 10:03 AM

నీటి పొదుపును పాటిద్దాం: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

09-08-2026 08:28 AM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలోని ప్రాజెక్టుల్లోఉన్న నీటిని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రాజెక్టుల నీటిమట్టం, సాగునీటి లభ్యత, పంటల సాగు, పంట మార్పిడి విధానాలు తదితర అంశాలపై నిర్వహించిన ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు అవసరమైన మేరకు వర్షపాతం నమోదైనప్పటికీ, కొన్ని మండలాల్లో సుమారు 20 శాతం వర్షపాతం లోటు ఉన్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో 'ఎల్ నినో' ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు కార్యాచరణతో సాగునీటి నిర్వహణ చేపడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని భవిష్యత్తు అవసరాలు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వినియోగిస్తామని తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ద్వారా జిల్లాలో సుమారు 35 వేల ఎకరాలకు, కడెం ప్రాజెక్టు ద్వారా 6 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు

వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాల లభ్యత తగ్గి బోరు బావులపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. పంట మార్పిడి విధానాలనుఅమలు చేయాలన్నారు. జిల్లాలో దావీదు సాగునీరు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ హారతుడి పంటలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ రాజేంద్ర ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.