సిద్ధీల సంగీతం
సుమారు మూడున్నర శతాబ్దాల క్రితం ఆఫ్రికా దేశాల నుండి లక్షలాది నల్లజాతివాళ్లు మనదేశానికి వచ్చారు. హైదరాబాద్ సహా, బొంబాయి, గోవా, అహ్మదాబాదు, బెంగుళూరు వంటి నగరాలకు వీరిని తీసుకువచ్చారు. వీరిని రాజులు, జాగీర్దార్లు, సంస్థానాధీశ్వరులు తమ రక్షణ దళాలలో, సైనిక దళాలలో నియమించుకున్నారు. వీరు యజమానులకు విశ్వాస పాత్రులుగా ఉంటూ వారి రక్షణ చూసేవారు. ఇక్కడికి వచ్చాక వీరు వివిధ మతాలలో చేరినట్లు తెలుస్తోంది. సిద్ధీలలో పెద్ద ఉద్యోగాలలో పనిచేసి గౌరవ ప్రతిష్టలు కలిగినవారు ఉన్నారు. చిన్న ఉద్యో గాలలో స్థిరపడిన పేద వర్గాల వారూ ఉన్నారు. హైదరాబాద్‌లో వీరందరి భాష ఉర్దునే. వీరిలో ఎక్కువ మంది ముస్లింలుగా ఉన్నారు.
తమ దేశం వచ్చినప్పటి నుండి తమ ఆచార్య వ్యవహారాలను, సంస్కృతిని మరిచిపోలేదు. దుస్తులు, వేషధారణలతోనే వీరిని గుర్తించవచ్చు. తమ నృత్య సంగీత సంప్రదాయాలను కాపాడుకున్నారు. వీరు చేసే నృత్యాలలో ఆదివాసీ గుణం, స్వభావం కానవస్తుంది. కొన్ని ఆఫ్రికా దేశాలలో వాడే రంగురంగుల దుస్తులను నేటికీ ధరిస్తారు. మెడ నుండి కింది వరకు ఒకే అంగీని వేసుకుంటారు. రంగురంగుల డిజైన్ల లుంగీలు కడతారు. కుర్తాలు వేసుకుంటారు.
తరతరాలుగా వస్తున్న సంగీత వాద్యాలతో ఆటపాటలతో నృత్యాలు చేస్తారు. వీరి నృత్య సంగీత వాద్యాలను మెచ్చి ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో పుట్టినరోజు, బారసాలలో, ఇతర వేడుకలకు వీరిని తమ వేడులకి పిలిపిం చుకుని వారి నృత్య సంగీతాలను ఆస్వాదిస్తారు. అద్భుతకళా ప్రదర్శన వీరి సొంతం. వీరిలో కొంతమంది హైదరాబాద్‌లో ఏసి గార్డెన్‌లో, మరికొందరు పాతనగరంలోని బార్కాస్‌లో నివసిస్తున్నారు.
వీరు వాయించే గడా ఘన వాద్యం కేటగిరీ కిందకు వస్తుంది. ఘనవాద్యాలు తాళలయలకు కారకాలు. ఇలాంటి వాద్యాలలో నాదం నిలిచి వినిపించదు. అందువల్ల ప్రజాదరణ పొందే జానపద వాద్యంగానే ఉండపోతుంది. ఆఫ్రికా నేలలో పుట్టిన సాంప్రదాయిక ఘటం ఇప్పుడు తెలంగాణ పాత పది జిల్లాలో శబ్దిస్తున్నది.






