డోలి మూగవోయింది!
సకిని రామచంద్రయ్య.. డోలి సంగీతానికి ఓ ఉనికి. తెలుగు, హిందీ, కోయ భాషల్లో వీర గాథలను డోలి వాయిస్తూ.. ఏకదాటిగా చెప్పే గొప్ప వ్యక్తి. జీవన పోరాటంలో ఎన్ని విపత్తులు సంభవించినా ఏనాడూ డోలీని వొదిలి పెట్టలేదు. అదే అతని జీవనాధారం. ఈ వాద్యం వాయిస్తూ గోత్రాల పూర్వ చరిత్రను తొవ్వుతూ.. గతంలోకి తీసుకెళ్లి కన్నీళ్లు తెప్పిస్తాడు. డోలి శబ్దంలో వచ్చే రిథమ్స్ కేవలం అతనికి మాత్రమే సొంతం. డోలి లేదా కంచుమేళమే జీవితంగా భావించి.. దాని కోసమే జీవితాన్ని అంకితం చేశాడు. అంతరించిపోతున్న డోలి వాయిద్యానికి జీవం పోశాడు. కోయదొరల ఇలవేల్పుల కథకుడు కంచుమేళం (డోలి) కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్యది భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామం. ఆయనకు భార్య బాపనమ్మ, కుమారుడు బాబూరావు, కుమారైలు వాణి, సుమలత ఉన్నారు. ఇవాళ ఆయన పూర్భం జరుపుకోవాల్సిన సందర్భం వచ్చిందని చెబుతున్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు. అవి ఆయన మాటాల్లోనే..
రామచంద్రయ్య ప్రత్యేకతేంటి?
కంచుమేళం లేదా డోలిలతోనే కథ చెప్ప డం సకిన రామచంద్రయ్య జీవనాధార వృత్తి. కోయల కర్మకాండలు నిర్వహించడం, పండుగలు చేయడం, సమ్మక్క, సారలమ్మ జాతరలో పాల్గొనడం, వీర పురుషులు, వీర వనితల కథలు చెప్పడం ఈ కళకారులు చేస్తుంటారు. ముఖ్యంగా రామచంద్రయ్య ప్రత్యేకత ఏంటం టే.. కొంత హిందీ, తెలుగు, కోయ భాషలో కూడా కథలు చెప్తాడు. చాలా మంది కేవలం కోయ భాషలో మాత్రమే చెప్తారు. రామ చంద్రయ్య అనర్గళంగా ఒక పది వీర గాథలను డోలి వాయిస్తూ చెప్తాడు. భద్రాచలం పక్కన తొక్కుడేం అనే గ్రామంలో సమ్మక్క, సారలమ్మ గుడి ఉంటుంది. 2014లో పది వేల మంది కళాకారులతో కథ చెప్పించాం. దాన్ని మేం సమ్మక్క, సారలమ్మ కథగా.. ‘వీరగాథ’ అనే పుస్తకంగా అచ్చువేశాం. దాని మీద ఆయ న ఫొటో ఉంటుంది.
అయితే ఈ కులాల వాళ్లకు, కథలు చెప్పేవాళ్లకు బాగా మద్యం తా గే అలవాటు ఉంటుంది. ఒకటేమో దేవుడికి నైవేధ్యం పెట్టడం.. రెండోది వీళ్లను పిలుచుకున్నాళ్లు నైవేధ్యం పెట్టడం ఉంటుంది. అప్పుడు కూడా వాళ్లు మద్యం సేవిస్తారు. కాబట్టి అట్లా కూడా కొంత ఆరోగ్యం దెబ్బతిన్నది. రామచంద్రయ్య దాదాపు ఎనిమిది నుంచి పది వీర గాథలు చెప్పేవాడు. అంటే డోలు వాయిస్తూ.. ఒక పర్ఫామెన్స్ చేస్తూ.. కథ చెప్పేవాడు. అట్లా మొదటిసారి ఆయనకు అవకాశం కల్పించాం. ఆ తర్వాత భద్రాచలంలో డోలి కథల మీద వర్క్‌షాప్ పెట్టాం. దానికి ఆయనే ప్రధానంగా ఉన్నాడు. 2018లో సిటీకి తీసుకొచ్చి సమ్మక్క, సారలమ్మ కథలకు సంబంధించి పలువురికి పరిచయం చేశాం. దాంతో రామ చంద్రయ్య కథ గవర్నర్ దృష్టిలో కూడా పడ్డా రు. అలా సక్సెస్‌ఫుల్‌గా ఆయనకు పద్మశ్రీ వచ్చింది.
రామచంద్రయ్యకంటే ముందు డోలి కళాకారులు ఉన్నారా?
రామచంద్రయ్య కంటే ముందు కూడా చాలామంది డోలి కళకారులు ఉన్నారు. ఈయన ప్రత్యేకత ఏంటంటే తెలుగువారికి తెలుగులో కొంత చెప్పగలడు. హిందీలో కూడా చెప్పగలడు. రామచంద్రయ్య కంటే ముందు బ్రహ్మనయ్య అనే ఒక అతను ఉండేవాడు. ఈయన కంటే సీనియర్.
ఈ కళారూపాన్ని ఎంతమంది అనుసరిస్తున్నారు?
ఈ కళారూపాన్ని అనుసరిస్తున్నా వారు మన తెలంగాణలో దాదాపుగా ఒక 80 మం ది ఉంటారు. ఇది ఒక తెగకు, కులానికి సం బంధించినది. అంటే కోయాల్లో ఇది ఒక ఉపతెగ. డోలి కళాకారుల్లో ఒక గౌరవనీయ స్థానం ఉండేది. తర్వాత రాను రాను అన్నీ ఉపకులాలగే కోయ ఉపతెగ మీద ఆధారపడాల్సి వచ్చింది. ఇంతకు ముందు హక్కు, గౌరవం ఉండేది. ఇప్పుడు కథ పూర్భం, వీర గాథలు చెప్పేవారు తగ్గారు. కొద్దిమంది మాత్రమే నైపుణ్యం, పాండిత్యం కలిగి ఉన్నారు. ఒక కథ చెప్పాలంటే ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారు. అప్పుడప్పుడు ఈ డోలీలు దొరకడం కూడా కష్టమైపోయింది. మొత్తం కోయ జాతికంతటికి పెళ్లిళ్లు, చావులు, పండుగలు, జాతరలు, పబ్బలన్నా వీళ్లే ఆధా రం. కానీ వీళ్ళకు ఆలయాల్లో రావాల్సిన హక్కులు, గౌరవం, ఆర్థిక సహాయం అందడం లేదని వీళ్లు చెబుతుంటారు. ఈ తెగ అంతరించకముందే ‘కోయ వీర గాథ చక్రం’ సేకరించి పెట్టాల్సిన అవసరం ఉంది.
కోయ కథల మీద ఏమైనా పరిశోధన జరిగిందా?
రామచంద్రయ్య మంచి కళాకారుడు. జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది. ఇతివృత్తానికి, చరిత్రకు కొంత లింక్ చెప్పగలిగే వాడు. అట్లా లింక్ చెప్పగలిగే వాళ్లు లేరు. అయితే మౌకిక కళాకారుడు కూడా కొన్ని లిమిటేషన్స్ కథ అనేది అనుశృతంగా వస్తుంది. అయితే చరిత్రకు మైనస్ సంబంధంలేని కథలు ఉంటుం ది. కాబట్టి ఆ చరిత్రను చెప్పడం కష్టం. మనకి బైండ్ల కథలో ఎల్లమ్మ కాకతీయ రాజులతో కోట్లాడింది. ఢిల్లీకి కూడా వెళ్లి కాకతీయ రాజుల మీద ఫిర్యాదు కూడా చేసి వచ్చింది. అంటే ఇది కొన్ని వేలమంది చెప్పే బైండ్ల కథ. మొత్తం ఆంధ్ర దేశంలో జముకులన్నా, బైండ్లన్నా ఒక్కటే. వాళ్లు కూడా ఈ కథ చెప్తారు. అంటే చరిత్రకు సంబంధించిన కథలు. కోయలకు సంబంధించినవి గానీ మిగతా వాటివి గానీ ఉన్నాయి. అయితే చరిత్రకు, కథ అంశాలలో ఉన్నటువంటి లింక్‌ని ఆయన చెప్పగలిగాడు. దాంతో మేం ‘కోయ అధ్యయన వేదిక’ అని మేం పెట్టుకున్నాం. దాంట్లో పద్దం అనసూయ, ప్రొఫెసర్ గూడురు మనోజ ఉన్నారు. ఆ కథ సేకరించడానికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, కోయ అధ్యయన వేదిక, తెలంగాణ రచయిత వేదిక, ఐటీడీఏ భద్రాచలం కలిసి సేకరించాం. హైదరాబాద్ నుంచి 15, 20 మంది పరిశోధక బృందం కూడా వెళ్లింది.
డోలిని లేదా కంచుమేళాన్ని ఎలా తయారు చేస్తారు?
ఇది రెండు అడుగుల వెడల్పు, మరికొద్ది ఎక్కువ పొడవుతో ఉండే చర్మవాద్యం. ఈ వాద్యాన్ని ఎక్కువగా కోయలలోని ప్రత్యేక పూజారులుగా, గౌరవంగా పిలువబడే డోలీ కోయలు వాయిస్తారు. వీరు కోయ ప్రజల కొలువులు, జాతరలు చేస్తారు. అంతేకాదు చావు, పుట్టుకలకి క్రతుకర్మకాండలు నిర్వహిస్తారు. పెళ్లిళ్లు చేస్తారు. ఆ సమయంలో ఈ డోలు తప్పనిసరి. అంటే ఇది ఒకరకంగా అధికారిక కోయవాద్యం. పేరుకి డోలు అంటారు. కానీ దీనికి కోయ సంస్కృతిలో ఎంతో గౌరవం ఉంది. డోలీలు ఈ డోలు వాయిస్తూ దాచి ఉంచిన ‘పడిగె’ని తీసి వివిధ జాతర సందర్భాలలో పగిడిగిద్దరాజు, ఎరమరాజు, బాపనమ్మ, గడికామరాజు, గాదిరాజు, గోవిందరాజు, తోటుమనెడి కర్ర, గుంజేటి ముసల మ్మ వంటి కోయ తెగవీరులు/ గోత్రాల పెద్దల కథలు చెబుతారు. డోలీలు ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఉన్నారు. వారూ ఇదే వాద్యం వాయిస్తారు. ఈ వాద్యాన్ని గుమ్మెడి లేదా వేగిన మొద్దుతో తయారు చేస్తారు. ఈ మొద్దును ఆవుపేడలో ఊరబెట్టి శుభ్రం చేస్తారు. మొద్దు కు చివరలను ఒక్కోవైపు 12 రంధ్రాలను చేస్తారు. డోలును మేకతోలుతో అటునిటు మూసివేస్తారు. మూసేప్పుడు సన్నని ఆరు వెదురు బద్దలతో కంటెలు చేసి కప్పుతారు. మధ్యలో మూడు రంధ్రాలను పెట్టి రెండు రంధ్రాలకు తాడు కడతారు. ఈ తాడుని మెడ లో వేసుకుంటారు. రెండు చేతులతో డోలీ వాయిస్తారు. వాయిస్తున్నప్పుడు గాలి నిష్క్రమించడానికి మూడో రంధ్రం పనికి వస్తుంది. డోలీడోలుని ఒకవైపు చేతితో రెండోవైపు సన్నని ‘సిర్ర’ తో వాయిస్తారు.
డోలిని ఏ ఏ సందర్భాల్లో వాయిస్తారు?
డోలిలు, కంచుమేళంతో కథలే చెప్తారు. కోయ డోలి అంటే డోలు అని అర్థం. ఆ రిథమ్స్ వాళ్ళకే అలవాటు. ఆ గోంతెత్తి రాగం తీస్తే పిచ్చిలేసి పోతుంది. ఆ రాగం వింటే మ్యాడ్ అయిపోతాం. అట్లాంటి వాళ్లు రాగం తీయడం.. ఆ రాగానికి అనుగుణంగా పాటలు పాడటం, కథలు చెప్తారు. దాంట్లో చరిత్రాక కథలు ఉన్నాయి. కొన్ని గోత్రా పురుషుల కథలు ఉన్నాయి. అయితే కొంతమంది చారిత్రక అంశాలు లేనివారు కూడా ఉంటారు. కానీ ములుగు, భద్రాచలంలో ఉండే వీళ్లందరికి చరిత్రతో సంబంధం ఉన్న హీరోలే. రామ చంద్రయ్య ప్రత్యేకత సమక్క, సారలమ్మ కథ చెప్పడం. ఆమె చరిత్రకు కొంత కనెక్షన్స్ ఇవ్వ డం జరిగింది. కాబట్టి ఆయన మరణం బాధకరం. ఇప్పుడు కథకు, చరిత్రకు లింక్ ఇచ్చే వాళ్లు లేరు. కథలు పాడతారు.. పగిడిద్ద రాజు ది, ముసలమ్మ, చారిత్రక పురుషులు సమ్మక్క, సారలమ్మ కుటుంబీకుల గురించి పాడతారు కానీ చరిత్రకు లింక్ ఇవ్వారు.
పూర్భం అంటే ఏమిటి?
గోత్ర చరిత్ర.. వ్యక్తి కుటుంబ చరిత్రను చెప్పుకోవడాన్ని పూర్భం అంటారు. రామ చంద్రయ్యకు సోమవారం పూర్భం జరిగింది. పూర్భం అంటే ఆయన పూర్వ చరిత్ర. ఒకసారి ఆయన చరిత్రను మన నం చేసుకుంటారు. కళాకారుడే కాదు.. మామూలు వ్యక్తి చనిపోయిన పూర్భం నిర్వహిస్తారు. ఒక వ్యక్తి చనిపో యినప్పు డు మనం ఏట్లా మంచి చెడ్డలు మాట్లాడుకుంటామో.. వాళ్ల చరిత్రను, వాళ్ల గోత్రాన్ని తొవ్వుకుంటారు. అంటే గోత్రాల పూర్వ చరిత్ర జ్ఞాపకం చేసుకోవడం ఆ రకంగా ఈ వాద్యకారులు కోయ చరిత్రని, సంస్కృతిని కాపాడే చరిత్రకారులు. డోలీల డోలు శబ్దంలో తరతరాల కోయచరిత్ర దాగి ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.
మా కళా ప్రతిరూపాన్ని కోల్పోయాం ఆదివాసీల పుట్టు, పూర్వతరాలు చెప్పగలిగే వ్యక్తి సకిని రామచంద్రయ్య. ఆయనలాంటి వారు చాలా తక్కువున్నారు. ఇప్పుడున్నా వారిలో బాపనయ్య అనే ఆయన ఉన్నారు. కానీ అందరి కంటే కథను గొప్పగా చెప్పగలిగే వ్యక్తి రామచంద్రయ్య. కోయ గాథలను, కథలను మౌఖికంగా, భద్రంగా దాచుకున్నా కోయ డోలీ సకిని రామచంద్రయ్య. 2014 నుంచి సకిని రామ చంద్రయ్యతో నాకు పరిచయం ఉంది. మా ఆదివాసీ కళలకు ప్రతిరూపం. ఆదివాసీ ఇంటి పురాణాలను గొప్పగా చెప్తారు. ముఖ్యంగా రామచంద్రయ్య అన్నీ కథలు చెప్పగలుతారు. రామచంద్రయ్య ప్రత్యేకత ఏంటంటే.. కోయ తెగలో ఉన్న ఇలవేల్పుల కథలన్నీ చెప్పగలడం. ఒక ఐదు, ఆరు తరాల పుట్టు, పూర్వతరాలు చెప్పే గొప్ప వ్యక్తి. ఇప్పుడున్న వారిలో కనీసం ఇంటి పేరు ఎలా వచ్చిందో కూడా చాలామందికి తెలియదు. సకిని రామచంద్రయ్యను కోల్పోవడం చాలా బాధాకరం. ఈ లోటు ను ఎవరూ భర్తీ చేయలేరు.
పద్దం అనసూయ
కోయ కవయిత్రి, రచయిత






