ముస్లింలు భారత్‌లో అంతర్భాగమే!
- వారు దేశంలో ఉండకూడదు అనుకునేవారు హిందువు కాదు..
- మతాల మధ్య ఐక్యత, సామరస్యం అవసరం
- మత విశ్వాసాల కంటే మానవత్వమే గొప్పది..
- రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్
- న్యూయార్క్ మాడిసన్ స్కేర్ వేదికగా పిలుపు
న్యూయార్క్, ఆగస్టు ౨౯: ‘భారత్ లో ముస్లింలు భారత్‌లో అంతర్భాగమే. వారు దేశంలో ఉండకూడదనుకునే హిందువులు, ఎప్పటికీ హిందువులు కాదు. హిందూత్వ అందరినీ కలుపుకుని పోయే విశాలమైన భావజాలం. మతాల మధ్య ఐక్యత, సామరస్యం అవసరం. మత విశ్వాసాల కంటే మానవత్వమే గొప్పది’ అని రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఎలుగెత్తి చాటారు.
అమెరికాలోని న్యూయార్క్ నగరం మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో శనివారం రాత్రి ‘అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ‘యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్స్’ పేరుతో నిర్వహించిన గ్లోబల్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. మతం పరమార్థం మనల్ని సత్యం వైపు నడిపించడమేనని అభిప్రాయపడ్డారు.
మతాలు వేరైనా మానవత్వమే ఉన్నతమైనదని చాటిచెప్పారు. పుట్టిన ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవంతో బతికే హక్కు ఉందని నొక్కిచెప్పారు. ప్రపంచ దేశాల్లోకెల్లా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో గొప్పవని, ఎన్నో విదేశీ దండయాత్రలను తట్టుకుని కూడా అవి నిలబడ్డాయని కొనియాడారు.
ప్రపంచంలో వివిధ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలకు ఫుల్‌స్టాప్ పెట్టడమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తాము పాలసీలు రూపొందిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం రాజకీయాలు కేవలం స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ లో చేరి పదవులు, ప్రయోజనాలు పొందాలని చూసేవారు, సంస్థలోకి రావాల్సిసిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్నవారికే ఆర్‌ఎస్‌ఎస్ అవకాశం కల్పిస్తుందని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన 1996లో హర్యానాలో జరిగిన వినాన ప్రమాద ఘటనను గుర్తుచేశారు.
ప్రమాదంలో చనిపోయినవారిలో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారని, నాడు సంఘ్ స్వయం సేవకులే ఘటనా స్థలానికి ముందుగా చేరుకున్నారని తెలిపారు. మృతదేహాలను గుర్తించడం, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం వంటి పనులు చేశారని గుర్తుచేశారు.
భారత్ ఎల్లప్పుడూ హిందూ దేశమేనని ఆర్‌ఎస్‌ఎస్ నమ్ముతుందని, హిందువులూ హిందూయేతరులు వేరు కాదని, అందరి పూర్వీకులు ఒక్కటేనని, అందరి డీఎన్‌ఏ ఒక్కటేనని స్పష్టం చేశారు. ‘నేను, నాది’ అనే భావన ఉన్న చోట పరిష్కారం దొరకదని, ‘మేము, మనది’ అనే భావనతోనే సమస్యలు తీరుతాయని అభిప్రాయపడ్డారు.






