తప్పనిసరిగా వ్యాక్సిన్ ఇప్పించాలి
వరంగల్, మార్చి 8 (విజయక్రాంతి): గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం 14 సంవత్సరాలు పూర్తి చేసి 15 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా ఇప్పించాలని వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి సూచించారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆదివారం నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్తో కలిసి ప్రారంభించారు.
అనంతరం బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ అందజేసి, వ్యాక్సినేషన్ ధృవపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. మహిళల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అయ్యే ఈ వ్యాక్సిన్ను ప్రభుత్వం పేద కుటుంబాల బాలికలకు ఉచితంగా అందించడం ఎంతో శ్లాఘనీయమన్నారు.
తల్లుల కమిటీలు, మెప్మా సిబ్బంది, డ్వాక్రా సంఘాలు, కార్పొరేషన్ సిబ్బంది గర్భాశయ క్యాన్స్ప అవగాహన కార్యక్రమాలు నిర్వహించి హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎ. అప్పయ్య, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ఆర్‌ఎంఓ డాక్టర్ మంజుల, డీటీసీఓ డాక్టర్ హిమబిందు, ఇంచార్జ్ డీఐఓ డాక్టర్ జ్ఞానేశ్వర్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ ప్రభుదాస్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మానస రెడ్డి, డాక్టర్ అనిల్, డాక్టర్ గీత, డెమో వి. అశోక్ రెడ్డి, హెచ్‌ఈఓ చంద్రశేఖర్, జీఎంహెచ్, పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.




