16 April, 2026 | 3:53 PM

ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడమే నా లక్ష్యం

17-05-2025 12:13 AM

తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నటి సమంత నిర్మించిన తొలిచిత్రం ‘శుభం’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. మే 9న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి, నిర్మాత సమంత మాట్లాడుతూ.. “10 శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చానా? అన్నది ఇప్పుడు నాకు అర్థం అవుతోంది.

‘శుభం’ మూవీకి పనిచేసిన ప్రతి ఒక్కరిలో నవ్వు, సంతోషం కనిపిస్తోంది. ఇదే అసలైన సక్సెస్. నాకు ఈ మూవీ చూస్తే నా సమ్మర్ హాలీడేస్ గుర్తుకు వచ్చాయి. పిల్లల్ని సినిమాలకు తీసుకు వెళ్లేందుకు మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఓ మూవీని మా ఫ్యామిలీ అంతా కలిసి చూసిన రోజులన్నీ నాకు మళ్లీ గుర్తుకు వచ్చాయి. అవన్నీ నిన్నే జరిగినట్టు అనిపించాయి.

‘శుభం’తో అందరినీ మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లాం. మేం ఇలాంటి మంచి చిత్రాలను తీసి కుటుంబాలను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. మీ తీపి జ్ఞాపకాల్ని మళ్లీ మీకు గుర్తు చేస్తూనే ఉంటాం.. అదే మా ట్రాలాలా లక్ష్యం. దాని కోసం ఎంతైనా కష్టపడుతూనే ఉంటాం. నటిగా ఉంటే లాస్ట్‌గా వస్తాం.. ఫస్ట్ వెళ్లిపోతాం. హీరోయిన్‌గా ఉన్నప్పుడు కేవలం నా పాత్ర గురించే ఆలోచించేదాన్ని.

కానీ నిర్మాతగా అసలు కష్టాల్ని తెలుసుకున్నా. సినిమా రిలీజ్‌కు ముందు మూడు రోజులు ఏ ఒక్కరూ నిద్రపోలేదు. అంత కష్టపడ్డ నా టీమ్‌కు సక్సెస్, క్రెడిట్ దక్కాలని కోరుకున్నా. ఇప్పుడు వస్తున్న ప్రశంసలన్నింటికీ వాళ్లే కారణం. రాజ్ అండ్ హిమాంగ్‌లే ట్రాలాలాకు వెన్నెముకలా నిలుచున్నారు. ప్రవీణ్ ఎప్పుడూ ట్రాలాలాలో ఓ భాగం. వసంత్ ఎప్పుడూ మా బ్యానర్‌లో భాగస్వామి” అన్నారు.

దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ.. ‘రాజ్ సహకారంతోనే ఈ మూవీని ఇంత బాగా తీయగలిగాను. ఆయన ప్రతీ క్రాఫ్ట్‌లో చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంటారు. ఆయన నా వెనక ఉండి నన్ను ముందుకు నడిపించారు. సమంత లేకపోతే ఈ మూవీని ఎవరు చూస్తారు? ఆమె వల్లే ఈ మూవీ జనాల్లోకి వెళ్లింది. ఇలాంటి మంచి చిత్రాలను సమంత నిర్మిస్తూనే ఉండాలి’ అన్నారు.

నటీనటులు వంశీధర్, హర్షిత్‌రెడ్డి, శ్రియా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి, చరణ్, షాలినీ, రాగ్ మయూర్, రచయిత వసంత్, కో ప్రొడ్యూసర్ హిమాంగ్, మైత్రి శశి, ప్రొడక్షన్ డిజైనర్ రామ్, క్యాస్టూమ్ డిజైనర్ పూజిత తదితర చిత్రబృందం తమ అనుభవాలు, అభిప్రాయలను ఈ వేదికపై పంచుకున్నారు.