జిల్లా కోర్టు సముదాయం గద్వాల పట్టణంలోనే నిర్మించాలి: న్యాయవాదుల డిమాండ్
గద్వాల టౌన్, జూన్ 8: జిల్లా కోర్టు సముదాయాన్ని పూడూరు శివార్లలో కాకుండా గద్వాల పట్టణంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ గద్వాల న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు.కోర్టు ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించిన వారు ప్రజల సౌకర్యార్థం కోర్టు జిల్లా కేంద్రంలోనే ఉండాలని కోరారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ పూడూరు ప్రాంతంలో రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు.గత మూడు సంవత్సరాలుగా వినతిపత్రాలు నిరసనల ద్వారా తమ అభ్యర్థనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ స్పందన లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు.గద్వాల పట్టణ పరిధిలో ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి అక్కడే జిల్లా కోర్టు సముదాయాన్ని నిర్మించాలని న్యాయవాదులు ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.






