05-06-2025 12:06:01 AM
వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంది ‘రానానాయుడు సీజన్2’. ఈ వెబ్‌సిరీస్‌ను కరణ్ అన్షుమాన్, సుపర్ణ్వర్మ, అభయ్చోప్రా దర్శకత్వంలో సుందర్ అరోన్, లోకోమోటివ్ గ్లోబల్ మీడియా సంయుక్తంగా నిర్మించారు. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ వేదికగా జూన్ 13 నుంచి తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సీజన్ మొత్తం యాక్షన్, డ్రామాతో నిండి ఉంటుంది.
ఇందులో నాగ నాయుడు 2.0 పూర్తి స్థాయి ధమాకాను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. నాగ నాయుడుగా వెంకటేశ్ దగ్గుబాటి అలరించనున్నారు. సిరీస్‌లో నాగనాయుడు స్వార్థపరుడు, నియమాలను ఉల్లంఘిస్తుంటాడు. తన కుటుంబం కోసం ఎంతవరకైనా వెళ్తాడు, చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తాడు.. అదే అతన్ని మనం గుర్తు పెట్టుకునేలా చేస్తుంది. అయితే, నిజ జీవితంలోని తన వ్యక్తిత్వానికి భిన్నంగా నాగ నాయుడు పాత్ర ఉంటుందని తెలుస్తోంది.
తాను పోషించిన నాగనాయుడు పాత్ర గురించి వెంకటేశ్ మాట్లాడుతూ.. “నాగ నాయుడు పాత్రను మనం ఊహించలేం. ఎప్పుడు ఏం చేస్తాడో చెప్పలేం. కానీ అతను తన కుటుంబం కోసం ప్రాణమిస్తాడు. అదే నాకు కనెక్ట్ అయిన పాయింట్. నిజ జీవితంలో నాకు ఆ పాత్రకు ఉన్న కనెక్షన్ అదే. మేమిద్దరం మా కుటుంబాలను ప్రేమిస్తాం.. కానీ అక్కడే ఎంతో తేడా ఉంటుంది.
నా పాత్ర ఎలా ఉంటుందో ఊహించగలరు. కానీ నాగ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవ్వరూ ఊహించలేరు. నాగకి డ్రామా అంటే ఎక్కువగా ఇష్టం. నాకు మైండ్ గేమ్స్ ఆడటం ఇష్టం ఉండదు.. నేను ఆడను. కానీ నాగ అలాంటి ఆటల్లో ఆశ్చర్యపరుస్తుంటాడు. అతను ఏం ఆలోచిస్తుంటాడో మనకు తెలియదు.. అస్సలు ఊహించలేం.. ఈసారి అభిమానుల్ని మరింతగా ఆకట్టుకునేలా ఈ పాత్ర ఉంటుంది” అని చెప్పారు.