calender_icon.png 28 July, 2025 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గలగలా కృష్ణమ్మ

28-07-2025 08:03:23 AM

  1. జలాశయం గేట్లు ఎత్తేందుకు మంగళవారం ముహూర్తం ఫిక్స్ చేసిన అధికారులు
  2. శ్రీశైలం నుంచి కృష్ణ‌మ్మ ప‌రుగులు.. నాగార్జున సాగ‌ర్‌కు జ‌ల‌క‌ళ‌..
  3. 584 అడుగులకు చేరుకున్న సాగర్ నీటిమట్టం
  4. కేంద్ర దళాల ఆధీనంలో సాగర్‌ ప్రధాన డ్యాం

నాగార్జునసాగర్: విజయక్రాంతి: ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ నాగార్జునసాగర్‌ జలాశయానికి(Nagarjunasagar Reservoir) వడివడిగా చేరుతోంది ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 1,20,482  క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో 1,12,976 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 26,744 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ నుంచి 20 వేల క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 30,917 క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నది.

శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగుల వద్ద ఉన్నది. అదేవిధంగా ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 215.80 టీఎంసీలకు గాను ఇప్పుడు 199.27 టీఎంసీలు ఉన్నాయి. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.విద్యుత్ ఉత్పత్తి చేసి  66,232 క్యూసెక్కుల నీరు సాగర్ కు విడుదల చేస్తున్నారు. కాగా, శనివారం రాత్రి భారీగా వరద ఉండటంతో అధికారులు రెండు గేట్లు ఎత్తివేశారు. అయితే ఆదివారం ఉదయానికి ప్రవాహం తగ్గడంతో ఒక గేటును మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఒక గేటు గుండా 26,744 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఈ నెల 8న శ్రీశైలం డ్యామ్‌ గేట్లను మొదటిసారి ఎత్తిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు (6, 7, 8, 11) గేట్లను నీటిని విడుదల చేశారు. అనంతరం వరద తగ్గుముఖం పట్టడంతో గేట్లను మూసివేశారు.

జలాశయం గేట్లు ఎత్తేందుకు మంగళవారం ముహూర్తం ఫిక్స్ 

కృష్ణమ్మ శ్రీశైలాన్నీ దాటేసి తెలుగు రాష్ర్టాల వర ప్రదాయిని అయిన నాగార్జున సాగర్‌ దిశగా పరుగులు పెడుతోంది. ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ నాగార్జునసాగర్‌ జలాశయానికి వడివడిగా చేరుతోంది. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో సాగర్‌ నిండు కుండలా మారింది. సోమవారం సాయంత్రానికల్లా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  మంగళవారం కల్లా ప్రాజెక్టు గేట్లను ఎత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తూ, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు.

నాగార్జునసాగర్ నీటి సమాచారం

సాగర్ ఇన్ ఫ్లో : 93115.క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 35749.క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం : 584 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం : 312.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం : 291.3795 టీఎంసీలకు చేరుకుంది.

కేంద్ర దళాల ఆధీనంలో సాగర్‌ ప్రధాన డ్యాం

నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి ఆశించిన మేర నీటిమట్టం చేరుతుంది. ఈ నేపథ్యంలో నీటి కేటాయింపుల విషయంలో ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీ చేతుల్లో పెట్టడం కంటే.. రాష్ట్రాల చేతుల్లోనే ఉండాల్సిన అవసరం ఉంది. ఎలాగూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను ఏపీ ప్రభుత్వం చూస్తుండడం వల్ల.. నాగార్జునసాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడమే సముచిత న్యాయం. నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేంద్ర బలగాల చేతుల్లోంచి తీసుకుని ఎస్పీఎఫ్‌కు అప్పగించాల్సిన అవసరం ఉంది.

కేంద్ర దళాల ఆధీనంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు..

సాగర్‌ ప్రధాన డ్యాంపై సీఆర్‌పీఎఫ్‌ బలగాల భద్రత కొనసాగుతోంది. కంట్రోల్‌ రూం వద్ద కూడా సీఆర్‌పీఎఫ్‌ బలగాలే పహారా కాస్తున్నాయి. ఎస్పీఎఫ్‌ బలగాలు కేవలం ఎడమ ఎర్త్‌ డ్యాం, గ్యాలరీలు, ఎడమ కాల్వ, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రాల వద్ద పహారా కాస్తున్నాయి.