కామారెడ్డిలో ‘నషా ముక్త్ యువ’ కార్యక్రమం
కామారెడ్డి, ఆగస్టు 2 (విజయక్రాంతి): వర్చువల్గా దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా యువతతో కనెక్ట్ అయిన ప్రధాని మోడీ, కామారెడ్డి ఆర్కే కళాశాల వేదికగా జిల్లా స్థాయి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ (వ్యసన రహిత భారతం) కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ ప్రోగ్రాం కామారెడ్డి జిల్లాలో ఘనంగా విజయవంతమైంది.
ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యావత్ భారతదేశంలోని సుమారు కోటి మందికి పైగా యువతతో వర్చువల్ విధానం ద్వారా ముఖాముఖిగా కనెక్ట్ అయ్యారు. ఈ పిలుపులో భాగంగా, కామారెడ్డి జిల్లా స్థాయి కార్యక్రమాన్ని కామారెడ్డి ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాల వేదికగా ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. వ్యసనాలకు దూరంగా ఉంటూ కెర్పీ దృష్టి పెట్టాలి: ప్రధానమంత్రి ఈ సందర్భంగా వర్చువల్ వేదిక ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. నషా ముక్త్ భారత్ నిర్మాణానికి యువత అంతా నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత ‘జెన్ జీ ’ తరం యొక్క ఆకాంక్షలు, కలలు నెరవేరాలంటే విద్యార్థులు తమ చదువు, కెరీర్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
అనంతరం యువతతో సామూహికంగా ‘మాదకద్రవ్యాల వ్యతిరేక’ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపర్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్కే విద్యాసంస్థల సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి, ప్రభుత్వ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రశేఖర్ అతిథులుగా పాల్గొన్నారు. వారితో పాటు వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపక బృందం, ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, ‘మై భారత్’ వాలంటీర్లు, వందలాది మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






