23 August, 2026 | 2:22 AM

సహకార రంగం బలోపేతంతో దేశాభివృద్ధి

23-08-2026 12:00 AM
  1. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ డైరెక్టర్ వినయ్ శీల్ గౌతమ్
  2. హనుమకొండ జిల్లా, ముల్కనూరు సహకార బ్యాంకు సందర్శన

భీమదేవరపల్లి, ఆగస్టు 22 (విజయక్రాంతి): సహకార సంఘాలు ఆర్థికంగా బలోపేతమైతే భారత్ ఆర్థికాభివృద్ధి మరింత మెరుగవుతుందని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ డైరెక్టర్ వినయ్ శీల్ గౌతమ్ అభిప్రాయపడ్డారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సహకార బ్యాంకును శనివారం ఆయన సందర్శించి సంఘ అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సహకార సంస్థ నిర్వహిస్తున్న ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలను ప్రవీణ్ రెడ్డి వివరించారు.

సహకార రంగంలో రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతుల భవిష్యత్ వ్యూహాత్మక అభివృద్ధి ప్రణాళికలను ప్రవీణ్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా వినయ్ శీల్ గౌతమ్ మాట్లాడుతూ ముల్కనూరు సహకార సంఘంలో అమలవుతున్న విధానాలను ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

సహకార సంస్థలు వేలాదిగా ఏర్పడితే భారత్ ఆర్థికంగా బలమైన శక్తిగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో హనుమకొండ జిల్లా సహకార అధికారి బానోత్ మోహన్, అసిస్టెంట్ రిజిస్టర్ సహకార మంత్రిత్వ శాఖ యూసఫ్ అలీ, ముల్కనూర్ సహకార సంఘం జీఎం మార్పాటి రామ్ రెడ్డి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సతీష్‌లు పాల్గొన్నారు.