3 March, 2026 | 4:20 PM

ఏయూలో ముగిసిన జాతీయ స్థాయి ఆవిష్కరణ హ్యాకథాన్

03-03-2026 02:33 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ చైర్ డీన్ డాక్టర్ జి. విష్ణుమూర్తి  మార్గదర్శకత్వంలో కన్వీనర్లు డాక్టర్ ఎస్. దీపిక, డాక్టర్ పి.రవీందర్ రావు, దుర్గా భవాని సమన్వయంతో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 170 జట్లు, 579 మంది విద్యార్థులు పాల్గొని తమ సృజనాత్మక ఆలోచనలను ప్రదర్శించారు. మైక్రోసాఫ్ట్ నిపుణులు ప్రాజెక్టులను ఆవిష్కరణ, వినియోగయోగ్యత, విస్తరణ సామర్థ్యం వంటి ప్రమాణాల ఆధారంగా మూల్యాంకనం చేశారు.

ఈ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ అతిథులు భూపేంద్ర సాహు, జయేశ్ తల్సానియా, రవి ముక్కవిల్లి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. హ్యాకథాన్ ద్వారా పరిశ్రమ సమస్యలకు పరిష్కారాల రూపకల్పనలో విద్యార్థులు విలువైన అనుభవాన్ని పొందారని వారు పేర్కొన్నారు. విద్యార్థి కన్వీనర్ రక్షిత్ సుంకు కార్యక్రమ నివేదికను సమర్పించారు. విజేత జట్లకు మొదటి బహుమతి రూ.10,000, ద్వితీయ, తృతీయ స్థానాలకు రూ.5,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు.