29 August, 2026 | 11:14 PM

మేజర్‌ ధ్యాన్‌చంద్‌ స్ఫూర్తితో క్రీడలను ప్రోత్సహించాలి

29-08-2026 10:40 PM

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా  క్రీడా పోటీలు

1,244 మంది క్రీడాకారుల పాల్గొనగా.. 444 మంది విజేతలు

ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో క్రీడల పాత్ర కీలకం: అదనపు కలెక్టర్‌ విక్టర్‌

దోమకొండ,(విజయక్రాంతి): మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని శనివారం దోమకొండ కోటలో ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో దోమకొండ ఫోర్ట్‌ అండ్‌ విలేజ్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ సహకారంతో ‘ఆడుదాం దోమకొండ’ కార్యక్రమంలో భాగంగా వివిధ క్రీడా పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి.

కబడ్డీ, టగ్‌ ఆఫ్‌ వార్‌, వాలీబాల్‌, క్రికెట్‌, రన్నింగ్‌, చెస్‌, క్యారం తదితర పోటీల్లో దోమకొండ, భిక్కనూరు, బీబీపేట్‌ మండలాలకు చెందిన పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు యువతీ యువకులు, మహిళలు, పురుషులు పాల్గొన్నారు. మొత్తం 1,244 మంది క్రీడాకారులు పాల్గొనగా, వివిధ విభాగాల్లో 444 మంది విజేతలుగా నిలిచారు. విజేతలకు బహుమతులు అందజేసి సత్కరించారు.

కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు విక్టర్‌, ఎన్‌.వై. గిరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విక్టర్‌ మాట్లాడుతూ మేజర్‌ ధ్యాన్‌చంద్‌ దేశానికి అందించిన క్రీడా సేవలు, సాధించిన విజయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, పట్టుదలను పెంపొందిస్తాయని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్రీడా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. యువత తమ ప్రతిభను వెలికితీసుకొని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొంత సమయం క్రీడలకు కేటాయించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

అనంతరం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడమే ‘ఆడుదాం దోమకొండ’ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్రీడాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, నిర్వాహకులు, స్వచ్ఛంద కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.