క్రీడల్లో రాణించి దేశానికి వన్నె తేవాలి
జడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారిణికి సన్మానం
గణపురం,(విజయ క్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి దేశానికి పతకాలు సాధించి వన్నె తేవాలని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేసు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ధ్యాన్‌చంద్ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని క్రీడాకారులందరికీ ధ్యాన్‌చంద్ గొప్ప స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు రన్నింగ్, కబడ్డీ, చెస్, క్యారమ్స్ తదితర క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఇదే వేదికపై గతంలో నారాయణపేట జిల్లా మక్తల్‌లో నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థిని అహీషాను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయురాలు కోసరి సరిత, ఉపాధ్యాయులు కుమారస్వామి, శాకీరా బేగం, రాంబాబు, శ్రీనివాస్, దేవేందర్, ముస్తాక్, దిల్షాద్‌లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.






