29 August, 2026 | 5:30 PM

పోలీసు పేరుతో రూ.30 వేలు స్వాహా

29-08-2026 04:59 PM

కంగ్టి, (విజయక్రాంతి): పోలీసుల పేరుతో సైబర్ మోసగాళ్లు మీ సేవా కేంద్రం నిర్వాహకుడిని మోసం చేసి రూ.30 వేలు కాజేసిన ఘటన కంగ్టిలో చోటుచేసుకుంది. కంగ్టి గ్రామానికి చెందిన మీ సేవా కేంద్రం యజమానికి గత జూన్ 2న 9030719143 నంబర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను కంగ్టి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నానని, తన పాపకు ప్రమాదం జరిగిందని, తన వద్ద నగదు ఉందని యూపీఐ ద్వారా డబ్బులు పంపితే నగదు ఇస్తానని నమ్మబలికాడు.

దీంతో బాధితుడు రూ.30 వేలు యూపీఐ ద్వారా బదిలీ చేశాడు. అనంతరం ఫోన్ చేయగా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్‌లో విచారించగా సైబర్ మోసానికి గురైనట్లు తెలిసింది. వెంటనే 1930కు ఫిర్యాదు చేయగా కంగ్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులమని, ఆర్మీ అధికారులమని చెప్పి డబ్బులు అడిగితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్మోసాలకు గురైతే వెంటనే 1930కు సమాచారం అందించాలని కోరారు.