ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభదాయకం
-ఏఈవో సునీల్ కుమార్
వెంకటాపూర్, మార్చి 10 (విజయక్రాంతి): ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు భూసారాన్ని పెంచుకోవడంతో పాటు అధిక లాభాలు పొందవచ్చని మండలంలోని రామానుజాపూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి సునీల్ కుమార్ తెలిపారు.
మంగళవారం పాలంపేట గ్రామంలో నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ కార్యక్రమంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల సాగు ఖర్చులు తగ్గడంతో పాటు భూమి సారాన్ని పెంచుకోవచ్చని, అలాగే రసాయన రహిత పద్ధతుల్లో పండించే పంటలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తాయని, పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రకృతి వ్యవసాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ప్రోత్సాహకాల గురించి రైతులకు వివరించారు. రైతులు ఈ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు, లాభాలు పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిఆర్పి లు సరళ, అరుణ, గ్రామ రైతు సంఘం సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




