సహజమైన ఆహారం ఆరోగ్యానికి రక్షణ: కేయూ విసి ప్రతాపరెడ్డి
హనుమకొండ,(విజయక్రాంతి): సహజ పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుందని కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి తెలిపారు. నిత్యం తీసుకునే ఆహారంలో సహజ పద్ధతిలో పండించిన ఉత్పత్తులు భాగం కావాలని సూచించారు. రసాయనాల అధిక వినియోగం ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని ఆయన పేర్కొన్నారు.
అనంతరం కేయూ ఈసీ మెంబర్ అనిత రెడ్డి, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు అలవరుచు కోవాలని, సహజ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని ఆమె తెలిపారు.
సోమవారం ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సహజ ఆహార ఉత్పత్తుల కేంద్రాన్ని ఉపకులపతి ప్రారంభించారు. ఈ కేంద్రంలో సహజ ఉత్పత్తులు 3 రోజులపాటు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భయ్యా సారయ్య, మిల్లెట్స్ ప్రమోటర్ నిమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




