12 June, 2026 | 5:32 PM

Breaking News

విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •  

కుమ్మెర ఘటనపై రాష్ట్రప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి

23-02-2026 03:50 PM

బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనంజయ నాయుడు డిమాండ్

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర(Kummera incident) గ్రామంలో రజక కుటుంబానికి చెందిన చిన్నారి మృతికి బాధ్యులపై హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనంజయ నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన ప్రజాసంఘాల నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, కుమ్మెరలో మానవత్వం మంట కలిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రజక కులంలో పుట్టిన కారణంగానే చంద్రకళ కుటుంబాన్ని దైవదర్శనం చేయకుండా అడ్డుకోవడం అమానుషమన్నారు.

గ్రామ సర్పంచి తుకారం రెడ్డి అహంకారంతో దుర్భాషలాడుతూ ఇంటిల్లిపాదిని అవమానించారని, పసిపిల్లను వదిలివేయమన్నా వినకుండా క్రూరంగా ప్రవర్తించారని ఆరోపించారు. చిన్నారి మృతికి సంబంధించి ఉన్నద్యాల శ్రీనివాసరెడ్డి, ఉపేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డిలను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసులో కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆరా తీసి న్యాయం చేయాలని కోరారు. హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్రంలో పోలీసుల వైఖరి ఆందోళన కలిగిస్తోందని, సూర్యాపేట జిల్లా చిలుకూరులో జరిగిన దళిత యువకుడు కర్ల రాజేశ్ లాకప్ డెత్ ఘటనపై చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని పేర్కొన్నారు.

తెలంగాణలో ఎస్సీ, బీసీ కులాలకు దైవదర్శనం నిషేధమా అంటూ ప్రశ్నించారు. ఒక సాధారణ సర్పంచికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని, అతని వెనుక ఎవరున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి బాధిత కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు కపిలవాయి గోపీచారి, బాలపీరు తదితరులు పాల్గొన్నారు.