21-07-2025 01:01:26 AM
కొండపాక, జులై 20: భూగర్భ జలవనుల కోసం నిర్మించిన చెక్ డ్యాములు ధ్వంసమై నెలలు సంవత్సరాలు గడుస్తున్న, చెక్ డ్యామ్ల మరమ్మత్తుల గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారని, అసలే వర్షాలు లేక రైతులు ప్రాణం అరచేతిలో పట్టుకుని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అడపా దడపా పడ్డ వర్షాపు నీరు నిలువ ఉండకుండా ధ్వంసమైన మరమ్మతులకు నోచుకోని చెక్ డ్యాములు.
అటకెక్కిన నిర్వహణ.
కొండపాక మండలం దుద్దెడ శివారులోని వాగుపై పలుచోట్ల చెక్ డ్యామ్ లు నిర్మించారు. వర్షపు నీరు పడ్డది పడ్డట్టుగా వెళ్ళిపోకుండా, నిలువ ఉండడానికిభూగర్భ జలవనరులు పెంపుదల కోసం చెక్ డ్యామ్ లు నిర్మించారు. కానీ వాటి నిర్వహణ మాత్రం మరిచి చిన్నచిన్న మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో చెక్ డ్యాములు శిథిలావస్థలో ఉన్నాయి.
వెలికట్ట గ్రామ శివారులో చెక్ డాం ఒక వైపు పూర్తిగా దెబ్బతిని వాగులో ఉన్న వర్షపు నీరు వృధాగా పోతున్నది. మరమ్మత్తులపై దృష్టి పెట్టాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పైగా ఊర్లో ఉన్న చెత్త చిదారాలతో చెక్ డాం కూరుకుపోయింది.
కోతకు గురై వృధాగా పోతున్న నీరు.
దుద్దెడ శివారులోని ఇదే వాగుపై నిర్మించిన మరో చెక్ డాం పక్కన భూమి కోతకు గురై నీరు నిల్వ ఉండకుండా వృధాగా పోతున్నది. ఇలా నిర్మించిన చెక్ డాంలను మరమ్మత్తులు చేయకపోవడంతో వాగులో ఉన్న నీరు అంతా వృధాగా పోతున్నది. చెక్ డ్యామ్ లో నీరు ఉంటే పరిసర ప్రాంతాలలో భూగర్భ జల వనరులు పెరిగి వ్యవసాయ బోర్లు నుంచి పంటలకు అవసరమైన నీరు అందుతుంది.
అలా కాకుండా నీరంతా నిలువ ఉండకుండా లోతట్టు ప్రాంతాలకు వృధాగా పోవడంతో ఈ ప్రాంత రైతులకు ఇబ్బందిగా మారింది. చెక్ డ్యామ్ల నిర్మాణం చేపట్టి నీరు వృధాగా పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని భూగర్భ జల వనరులు పెంపొందేలా కృషి చేయాలని మండలంలోని ప్రజలు కోరుకుంటున్నారు.
నివేదిక పంపించాం
చెక్ డ్యామ్ మరమ్మతుల కోసం నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు మరమ్మతులు చేపడతాం.
భాగ్యలక్ష్మి, ఇరిగేషన్ ఏఈ, కొండపాక