ఒకసారి వచ్చి కలిసిపోండి!
ఈఎస్‌ఐ బిల్లులు చెల్లించేందుకు ‘మామూలు’ గొళ్లెం
మందుల సరఫరాదారులకు అధికారుల సూచనలు
రామచంద్రాపురం ఈఎస్‌ఐ నోడల్ సెంటర్‌లో మరీ దారుణం
మందుల ఆర్డర్ ఇవ్వాలన్నా.. బిల్లులు చెల్లించాలన్నా.. ‘మామూళ్లే’ మందు
ఏటా రూ.240 కోట్ల వరకు మందులు, సర్జికల్స్, ఇతర కొనుగోళ్లు
ఏడాదిన్నర గడిచినా బిల్లుల తయారీలో నిర్లక్ష్యం
హైదరాబాద్, మార్చి ౭ (విజయక్రాంతి)
‘.. సార్ మా కంపెనీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.. ఒకసారి చూడండి.. బడ్జెట్ కూడా రిలీజ్ అయ్యింది.. ఇప్పటికే 500 రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి.. ప్లీజ్ సర్..’ అంటూ ఒక మందుల సరఫరాదారుని వేడుకోలు..
‘.. అవునవును చాలా ఆలస్యం అయ్యింది. మరేం ఫరవాలేదు. పని అయిపోతుంది.. ఒకసారి వచ్చి కలిసిపొండి’ అం టూ సదరు ఆఫీసులో బిల్లులు తయారుచేసే అధికారి ‘మామూలు’ సూచన..
ఇదీ స్థూలంగా ఈఎస్‌ఐ బిల్లుల చెల్లింపుల్లో నోడల్ సెంటర్లలో నడుస్తున్న ‘మా మూలు’ దందా. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 80 వరకు డిస్పెన్సరీలు.. మూడు నోడల్ సెంటర్ల పరిధిలో పనిచేస్తుంటాయి. నాచా రం, రామచంద్రాపురం, వరంగల్‌లలో మూడు నోడల్ సెంటర్లు ఉన్నాయి. ఒక్కోదాని పరిధిలో సుమారు 20 నుంచి 30 డిస్పెన్సరీలు ఉన్నాయి. మూడు నెలలకు ఒకసారి (క్వార్టర్) మందులు, సర్జికల్స్, ఇతర పరికరాలు, వస్తువులను నోడల్ సెంటర్లు ఆర్డర్ ఇస్తూ.. డిస్పెన్సరీలకు అందిస్తుంటాయి.
కేంద్రం నుంచి ఏటా సుమారు రూ. 250 కోట్ల వరకు బడ్జెట్ వస్తుండటంతో నిధులకు ఎలాంటి లోటు లేదు. కానీ మం దుల సరఫరాదారులకు సకాలంలో చెల్లించాల్సిన బిల్లులను కావాలనే నోడల్ సెంటర్లలో ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి. రాచమంద్రాపురం నోడల్ సెంటర్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని మందుల సరఫరాదారులు బోరుమంటున్నారు. మూడు నెలలకు ఒకసారి ఒక్కో నోడల్ సెంటర్ పరిధిలో సుమా రు రూ.20 కోట్ల విలువైన మందులు, సర్జికల్స్, ఇతర పరికరాలు, వస్తువులను కొను గోలు చేస్తుంటారు.
అంటే ఏటా సుమారు రూ.240 కోట్ల విలువైన మందులు, సర్జికల్స్, ఇతర పరికరాలు, వస్తువులను ఈఎస్ ఐ పరిధిలోని డిస్పెన్సరీల కోసం కొనుగోలు చేస్తుంటారు. ఇలా ఆర్డర్ ఇచ్చిన తరువాత మందులు, సర్జికల్స్ సరఫరాదారులు నిర్దేశిత సమయంలోగా వాటిని సరఫరా చేస్తా రు. 40 రోజుల్లో బిల్లులను నోడల్ సెంటర్ నుంచి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అందు కు ఆయా నోడల్ సెంటర్ల పరిధిలో ఉన్న అధికారులు ఈ బిల్లులను సిద్ధంచేసిన రిలీజ్ చేయాలి.
బిల్లుల చెల్లింపులో ఆలస్యం..
వాస్తవానికి మందులు సరఫరాచేసిన 40 రోజుల్లో చెల్లించాల్సిన బిల్లులను ఈ మధ్య చాలా ఆలస్యం చేస్తున్నారు. రామచంద్రాపురం నోడల్ సెంటర్‌లో మరీ దారుణం గా ఉందని.. 500 రోజులు అంటే ఏడాదిన్నర గడుస్తున్నా బిల్లుల చెల్లింపులో తాత్సా రం చేస్తుండటంతో మందుల సరఫరాదారుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. బిల్లులు సకాలంలో చెల్లించకపోతే తాము మందులు సరఫరా చేయలేమంటూ చేతులెత్తేసే పరిస్థితి నెలకొందని.. దీనిపై ఉన్నతాధికారులు కల్పించుకోవాలని కోరుతున్నారు.
ఒక శాతం వరకు ‘మామూలు’
ప్రతి మూడు నెలలకు ఒకసారి అర్డర్ ఇచ్చే సమయంలోనే నోడల్ సెంటర్లలో ఒక్కో మందుల సరఫరాదారు నుంచి సద రు ఏజన్సీకి ఇచ్చే ఆర్డర్ ఎంత ఉంటుందో అందులో సుమారు ఒక శాతం వరకు ‘మామూలు’గా వసూలు చేస్తుంటారు. అయితే ఇది ఎవరికీ ఇబ్బంది కలిగించదని, సహజంగానే సకాలంలో బిల్లులు ఇస్తారని.. అందు కు తాముకూడా సంతోషంగా ఒక శాతం ఇవ్వడానికి ఇబ్బంది పడమనికూడా మందుల సరఫరాదారులు అంటున్నారు.
అయితే.. బిల్లుల చెల్లించేటప్పుడే ఇప్పుడు అసలు తకరారు మొదల వుతుందని వారంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బిల్లులు చెల్లించేటప్పుడుకూడా 3 నుంచి 4 శాతం చెల్లిం చాలనే సూచనను అన్యాపదేశంగా చెబుతున్నారని వాపోతున్నారు. ఈ ఒత్తిడి నాచా రం, వరంగల్ నోడల్ సెంటర్లలో అం తగా లేదని.. కానీ కొద్ది కాలం నుంచి రామచంద్రాపురం నోడల్ సెంటర్‌లో పటిష్టంగా అమలు చేస్తూ.. మందుల సరఫరాదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
రెగ్యులర్ మెడికల్ డైరెక్టర్ లేకపోవడంతోనే..
నిజానికి ఈఎస్‌ఐ కార్యకలాపాలన్నీ డైరెక్టర్ పర్యవేక్షణలో కొనసాగాలి. కొన్నేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ డైరెక్టర్‌ను నియమించడం లేదు. సీనియర్ ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వస్తోంది. రెగ్యులర్‌గా ముఖ్యమైన శాఖలను చూడటానికే వారికి సమయం సరిపోవడం లేదు. దీంతో అదనపు బాధ్యతలు అయిన ఈఎస్‌ఐ డైరెక్టర్‌గా కేవలం ఫైళ్లపై సంతకాలు చేయడానికే సమయం ఇవ్వడం లేదు.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించింది. ఇలా పర్యవేక్షణ లోపించడంతోనే ఇలాంటి ‘మామూలు’ డిమాండ్లు వినపడుతున్నాయని మందుల సరఫరాదారులు చెప్తున్నారు. రెగ్యులర్ డైరెక్టర్‌ను అదికూడా మెడికల్ డైరెక్టర్‌ను నియమిస్తేనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, తద్వారా మెరుగైన వైద్యసేవలను ఈఎస్‌ఐ లబ్ధిదారులకు అం దించవచ్చని మందుల సరఫరాదారులు పేర్కొంటున్నారు.
ఆర్డర్ సమయంలో.. బిల్లులు ఇచ్చేటప్పుడు..
40 రోజుల్లో చెల్లించాల్సిన బిల్లులను ఏడాదిన్నరగా పెండింగ్‌లో పెట్టడంతో మందులు సరఫరా చేయలేకపోతున్నామని వారు వాపోతున్నారు. బడ్జెట్ విడుదలై నిధు లు అందుబాటులో ఉన్నా కావాలనే బిల్లు లు తయారు చేయడంలేదని వారంటున్నా రు. సర్ బిల్లులు తయారు చెయ్యండని రామచంద్రాపురం నోడల్ సెంటర్‌లో అధికారులను, సిబ్బందిని కోరితే.. ఒకసారి వచ్చి కలిసిపొండి అంటూ.. ఉచిత సలహా ఇస్తున్నారని.. కలిసిపోండని అంటే.. పర్సెంటే జీలు ఇవ్వడమేనని వారు ఆరోపిస్తున్నారు.
నిబంధనల ప్రకారం 40 రోజుల్లో ఇవ్వాల్సిన బిల్లులు.. బడ్జెట్ ఉన్నా బిల్లుల తయా రీలో తాత్సారం చేస్తున్నారు. ఎవరు వచ్చి కలిస్తే.. వారి బిల్లులు తయారవుతున్నాయి. బిల్లులు చెల్లిస్తున్నారు. దీనితో మందుల సరఫరాదారులు గత్యంతరం లేక ఒకసారి కలిసి వస్తే.. కనీసం బిల్లులన్నా విడుదల అవుతాయనే ఆశతో వెళ్లక తప్పడం లేదు. ఏడాది మొత్తంపై రూ.240 కోట్ల కొనుగోళ్ల సమయంలో (ఆర్డర్ ఇచ్చేటప్పుడు) ఒక శాతం అంటే సుమారు రూ.2.4 కోట్లు. ఇక బిల్లుల చెల్లింపుల్లో 3 నుంచి 4 శాతం అంటే.. ఎంత లేదన్నా.. రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుందని.. అంత మొత్తంలో ‘మామూళ్లు’ ఇచ్చుకోలేమంటూ చెతులెత్తేస్తున్నారు.




