28 April, 2026 | 1:56 AM

పశువుల పాక బిల్లుల్లో టీఏ, ఎఫ్‌ఏల నిర్లక్ష్యం

28-04-2026 12:00 AM
  1. క్షేత్రస్థాయి అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం 
  2. నిబంధనలు పాటించి నిర్మిస్తే.. బిల్లులు ఇవ్వరా 
  3. అవసరమైతే ఏసీబీ ని ఆశ్రయిస్తాం : బాధితులు 

నవాబ్ పేట, ఏప్రిల్ 27 : పేద రైతులకు భరోసా ఇవ్వాల్సిన అధికారులే వారి పాలిట శాపంగా మారుతున్నారు. నవాబ్ పేట మండలం కాకర్లపహాడ్ గ్రామంలో ఒక పేద మహిళా రైతుకు మంజూరైన పశువుల పాక బిల్లుల విషయంలో క్షేత్రస్థాయి అధికారులు నిర్లక్ష్యం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం నిర్మాణం పూర్తి చేసినా, ఆశించిన ‘ముడుపులు’ అందలేదన్న కక్షతోనే బిల్లులు ఆపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆధారాలతో సహా నిలదీత రైతు నిలదీయడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాకర్ల పహాడ్ గ్రామానికి చెందిన తానేం బాలమ్మ అనే మహిళా రైతుకు పశువుల పాక మంజూరు కాగా, సాంకేతిక సహాయకులు, ఫీల్ అసిస్టెంట్ లు లబ్ధిదారుడిని కావాలనే వేధిస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోననిరైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక నిర్మాణం పూర్తయినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ తప్పుడు రిపోర్టులు ఇచ్చి వేజ్,మెటీరియల్ పేమెంట్స్ రాకుండా అడ్డుపడుతున్నారని రైతు ఆరోపిస్తున్నారు. వీరి అక్రమాలపై బాధితుడు తానేం సత్యనారాయణ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా, Lr. No. D7/Catl shed/2026 ద్వారా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

కలెక్టర్ ఉత్తర్వులకే పట్టించుకోరా ?

జిల్లా కార్యాలయం నుండి సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి (ఈజిఎస్) ని తనిఖీకి పంపాలని ఆదేశాలు వచ్చినా, స్థానిక అధికారులు వారిని రాకుండా అడ్డుకుంటూ అక్రమాలకు రక్షణ కవచంలా మారుతున్నారని బాధితుడు మండిపడ్డారు. ‘ప్రభుత్వ నిబంధనలు ప్రజల కోసమా? లేక అధికారుల జేబులు నింపుకోవడానికా?‘ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తప్పు చేసిన ప్రతి అధికారి జవాబుదారీ కావాల్సిందేనని వారు అంటుండ్రు.

నా తల్లి బాలమ్మకు రావాల్సిన న్యాయమైన డబ్బును అడ్డుకుంటున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని, తనిఖీ నివేదికలో నిజాలు బయటకు రాకుండా వీరు చేస్తున్న ప్రయత్నాలను జిల్లా యంత్రాంగం గమనించాలి. వెంటనే బిల్లులు చెల్లించకుంటే, సాక్ష్యాలతో సహా ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తాంఅని రైతు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి బాధిత రైతుకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.