26 February, 2026 | 10:58 AM

పేదోడి కడుపు కొడుతున్న నిర్లక్ష్యం

26-02-2026 12:00 AM

కిస్మత్‌పుర ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద నిలిచిపోయిన సన్నబియ్యం పంపిణీ!

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 25 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ’పేదలకు సన్నబియ్యం’ పథకం క్షేత్రస్థాయిలో అధికారుల ఉదాసీనతకు బలైపోతోంది. ‘అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని‘ అన్న చందంగా, గోదాముల్లో బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ, అవి సకాలంలో రేషన్ దుకాణాలకు చేరడం లేదు. కిస్మత్పుర సివిల్ సప్లై కార్పొరేషన్ స్టేజ్-2 పాయింట్ పరిధిలో జరుగుతున్న జాప్యం ఇప్పుడు ఐదు మండలాల పేద ప్రజలను ఆకలితో అలమటించేలా చేస్తోంది.

కిస్మత్పుర పాయింట్ పరిధిలో మొత్తం 212 రేషన్ దుకాణాలు ఉండగా, నెలాఖరు (బుధవారం) నాటికి కేవలం 17 షాపులకు మాత్రమే బియ్యం సరఫరా కావడం గమనార్హం. అంటే ఇంకా 195 దుకాణాలకు బియ్యం అందాల్సి ఉంది. నెలకు కేవలం రెండు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, ఇంత తక్కువ సమయంలో మిగిలిన అన్ని దుకాణాలకు సరఫరా చేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వైఫల్యం ఎవరిది?.. పర్యవేక్షణ ఎక్కడ?

ఈ గందరగోళానికి ప్రధాన కారణం స్టేజ్-1 మరియు స్టేజ్-2 కాంట్రాక్టర్ల మధ్య సమ న్వయ లోపమా? లేక అధికారుల పర్యవేక్షణా రాహిత్యమా? అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. స్టేజ్-1 గోదాముల్లో బియ్యం సిద్ధంగా ఉన్నా, స్టేజ్-2 పాయింట్లకు చేరవేయడంలో కాంట్రాక్టర్లు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. బియ్యం సరఫరా పర్యవేక్షణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.ప్రతి నెలా 1వ తేదీ నుంచే పంపిణీ జరగాల్సి ఉండగా, కనీసం ముం దస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

మండలాల వారీగా ప్రభావం..

కిస్మత్పుర పరిధిలోని రెండు గోదాముల ద్వారా ఐదు మండలాలకు సరఫరా జరగాలి. గోదాం-1 (ఇంచార్జ్ భార్గవ రెడ్డి) గండిపేట, మొయినాబాద్, శంషాబాద్ మండలాల్లోని 99 దుకాణాలు.గోదాం-2 (ఇంచార్జ్ మురళీకృష్ణ) రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి మండలాల్లోని 113 దుకా ణాలకు ప్రతినెల సరఫరా చేయాల్సి ఉంటుంది.

సన్న బియ్యం సరఫరా జాప్యం పై గోదాం-2 ఇంచార్జ్ మురళీకృష్ణ ను వివరాణ కోరగా ‘ఈ నెల 24నే మాకు బియ్యం కోటా అందింది. స్టేజ్-1 నుండి రావాల్సిన బియ్యం కూడా సకాలంలో అందలేదు. పైగా గోదాం సామర్థ్యం తక్కువగా ఉండ టం ఒక సమస్యగా మారింది. రాబోయే రెండు మూడు రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన సగం కోటా అయినా పంపిణీ చేసి, వెంటనే రెండో విడతలో పూర్తి చేస్తాం‘ అని తెలిపారు.

ప్రశ్నార్థకంగా పేదల ఆకలి తీరు..

ప్రభుత్వం మంచి సంకల్పంతో సన్నబియ్యం ఇస్తున్నా, క్షేత్రస్థాయిలో యంత్రాం గం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఫిబ్రవరి మాసం ముగుస్తున్నా ఇంకా 90% దుకాణాలకు బియ్యం చేరకపోవడం అధికారుల అసమర్థతకు నిదర్శనం. ఉన్నతాధి కారులు స్పందించి ఈ రవాణా అడ్డంకులను తొలగించకపోతే, పేదవాడికి అందా ల్సిన ’సన్న బియ్యం’ కేవలం కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.