14-11-2025 11:26:54 PM
మల్కాజ్గిరి,(విజయక్రాంతి): నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న భార్య హత్య కేసులో ప్రధాన నిందితుడైన వినాయక నగర్‌కు చెందిన యెల్లయ్య (46) కు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ కుషాయిగూడ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2023లో నమోదైన క్రైం నంబర్ Cr.No.1005/2023లో, భార్యపై వేధింపులు, హత్యకు సంబంధించిన నేరాలపై సెక్షన్‌లు 498-A, 302 IPC కింద కేసు నమోదు చేయగా, విచారణ అనంతరం అదనపు జడ్జి నిందితుడికి శిక్షను ప్రకటించారు.
అధికారుల వివరాల ప్రకారం, కుటుంబ కలహాల నేపథ్యంలో యెల్లయ్య తన భార్యను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఘటనా స్థల పరిశీలన, వైద్య నివేదికలు, సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం కఠినమైన శిక్షను విధించింది. ఈ తీర్పు మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలకు గట్టి హెచ్చరికగా నిలుస్తుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.