16-06-2025 08:49:01 AM
జెరూసలేం: ఇజ్రాయెల్ పై ఇరాన్ మరోసారి క్షిపణులను(Iranian Ballistic Missile Strikes) ప్రయోగించింది. ఇరాన్ నుంచి కొత్త క్షిపణులను గుర్తించినట్లు ఇజ్రాయెల్ సైన్యం(Israeli Army) వెల్లడించింది. ఇరాన్ క్షిపణులు జెరూసలెం మీదుగా వెళ్లినట్లు ఐడీఎఫ్ గుర్తించింది. ఆదివారం సాయంత్రం, ఇరాన్ నుండి ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ కూల్చివేసినప్పుడు టెల్ అవీవ్, జెరూసలేం పైన ఆకాశంలో పేలుళ్లు సంభవించాయి. శనివారం రాత్రి జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్‌లో ఇద్దరు పిల్లలు సహా పది మంది మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ తన దాడులు టెహ్రాన్‌లోని డజన్ల కొద్దీ లక్ష్యాలను ఛేదించాయని తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ ఇరాన్ మీడియా ఆదివారం సాయంత్రం నాటికి 224 మంది ఇరానియన్లు మరణించారని, 1,277 మంది గాయపడ్డారని తెలిపింది. ఇజ్రాయెల్ మొదటగా శుక్రవారం ఇరానియన్ అణు మౌలిక సదుపాయాలు, ఇతర లక్ష్యాలపై దాడి చేసింది.
డొనాల్డ్ ట్రంపును ఇరాన్ చంపాలని చూస్తుంది: ఇజ్రాయెల్ ప్రధాని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US Trump)ను ఇరాన్ చంపాలని చూస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కార్యక్రమానికి ముప్పుగా ట్రంప్ ను గుర్తించిందని నెతన్యాహు వెల్లడించారు. ఇరాన్ కు ట్రంపే నంబర్ వన్ శత్రువని ఇజ్రాయెల్ ప్రధాని అన్నారు. ట్రంప్ నిర్ణయాత్మక నాయకుడని నెతన్యాహు కితాబిచ్చారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదన్నారు. ఇజ్రాయెల్ తనను కాకుండా ప్రపంచాన్ని కూడా రక్షిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఇరాన్ అణు కార్యక్రమాలు చేపట్టిందని నెతన్యాహు ఆరోపించారు. ఇరాన్ తో జరిగిన నకిలీ అణు ఒప్పందాన్ని ట్రంప్ రద్దు చేశారని నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని చాలా వరకు వెనక్కి నెట్టాయని ప్రధాని నెతన్యాహు వెల్లడించారు.
నేను ఎంతో చేసినా గుర్తింపు దక్కడం లేదు: అమెరికా అధ్యక్షఉడు ట్రంప్
ఇజ్రాయెల్-ఇరాన్(Israel-Iran War) మధ్య తాను మధ్యవర్తిత్వం వహించవచ్చని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ చర్చల్లో పురోగతి కనిపిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య త్వరలో శాంతియుత వాతావరణం నెలకొని ఒక డీల్ జరుగుతోందని చెప్పారు. నా జోక్యం అనేక సంఘర్షణలతో ఉన్న దేశాల మధ్య శాంతికి దారితీసిందన్నారు. తన వల్ల యుద్ధాలు ఆగినా.. తనకు మాత్రం గుర్తింపు రాలేదని ట్రంప్ వెల్లడించారు.