షరీఫ్ సరికొత్త రాగం
కార్గిల్ యుద్ధం జరిగిన 24 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తాము తప్పు చేశామని అంగీకరించారు. అంతేకాదు ఈ ఘటనకు అప్పటి సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కారణమని కూడా ఆరోపించారు. పాకిస్థాన్ తొలి అణు పరీక్ష జరిపి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. లాహోర్ లో తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో షరీఫ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.‘ నేను ప్రధానిగా ఉన్నప్పుడు 1998 మేలో పాక్ అయిదు అణుబాంబు పరీక్షలు జరిపింది. దాని తర్వాత 1999 ఫిబ్రవరి 21న భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఇరు దేశాల మధ్య శాంతియుత పరిస్థితులను కాపాడాలన్న సదుద్దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
అయితే ఆ ఒప్పందాన్ని మనం ఉల్లంఘించాం. అది మన తప్పే’అని షరీష్ ఆ సమావేశంలో వ్యాఖ్యానించారు. లాహోర్ వేదికగా భారత్, పాక్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ‘లాహోర్ డిక్లరేషన్’ అంటారు. ఇందులో భాగంగా ఇరు దేశాలు శాంతి నెలకొల్పాలని, ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందించాలని ప్రతిపాదించాయి. అయితే ఆ తర్వాత కొద్ది నెల లకే పాక్ ప్రభుత్వం జమ్మూ, కశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో చొరబాట్లకు తెరదీసింది. కార్గిల్ యుద్ధానికి దారి తీసిన పరిస్థితుల గురించి తెలుసుకోవాలంటే ముందుగా దాని భౌగోళిక పరిస్థితుల గురించి తెలుసుకోవాలి. భారత్ పాకిస్థాన్ విభజన జరగక ముందు కార్గిల్ ప్రాంతం లడఖ్‌లోని బల్టిస్థాన్ జిల్లాలో భాగంగా ఉండేది.
మొదటి కశ్మీర్ యుద్ధం(194748) తర్వాత నియంత్రణ రేఖ బల్టిస్థాన్ జిల్లా గుండా వెళ్లడంతో భారత్‌లోని కశ్మీర్‌లో భాగమైంది. 1971 యుద్ధంలో పాక్ ఓటమి తర్వాత ఇరుదేశాల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దును అంగీకరించడంతో పాటు ఇక్కడ ఎటువంటి కాల్పులు జరపకూడదు. అయితే 1999లో ఈ ప్రాంతంలోకి పాక్ సైనికులు చొరబాటుదారుల ముసుగులో వచ్చి 160 కిలోమీటర్ల పొడవునా కొండలపై నుంచి భారత సైనిక స్థావరాలపై కాల్పులు జరిపారు. చుట్టూ ఉన్న ముఖ్యమైన స్థావరాలను స్వాధీనపరుచుకోవడం ద్వారా ఆ ప్రాంతంపై పట్టు సాధించడమే పాక్ పన్నాగం ఉద్దేశం.
భారత మాజీ సైన్యాధిపతి వీపీ మాలిక్, రక్షణ రంగ నిపుణుల ప్రకారం ఈ కార్యక్రమానికి పాక్ చాలా కాలం క్రితమే రంగం సిద్ధం చేసుకుంది. కానీ యుద్ధ తీవ్రతకు భయపడి వెనక్కి తగ్గింది. అయితే 1998లో ముషారఫ్ పాక్ సైన్యాధిపతి కాగానే ఈ పథకానికి ప్రాణం పోశారు. ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో రెండు నెలలకు పైగా జరిపిన ఎదురుదాడిలో పాక్ ఆక్రమించుకున్న అన్ని స్థావరాల ను భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ ఒత్తిడి ఫలితంగా పాక్ వెనక్కి మళ్లడం ప్రారంభించింది. జూలై 26న ‘ఆపరేషన్ విజయ్’ విజయవంతమయినట్లు ప్రకటించడంతో యుద్ధం ముగిసింది.
కానీ, యుద్ధం తర్వాత నవాజ్ షరీఫ్ ఈ విషయాలేవీ తనకు తెలియవని, భారత ప్రధాని చేసిన ఫోన్ ద్వారానే తనకు విషయం తెలిసిందని జర్నలిస్టులకు చెప్పారు. అయితే లాహోర్ ఒప్పందానికి 15 రోజుల ముందే తాను ఈ విషయాన్ని షరీఫ్‌కు తెలియజేశానని ముషారఫ్ చెప్ప డం గమనార్హం. అప్పుడు తనకేమీ తెలియదని చెప్పిన షరీఫ్ ఇప్పుడు తమ వల్ల తప్పు జరిగిందని, దానికి ముషారఫే కారణమని చెప్పడానికి పాక్ రాజకీయ పరిస్థితులే కారణం.
పాక్‌ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరో వైపు పాక్ ఆక్రమిత కశ్మీర్( పీవోకే) ప్రాంత ప్రజలు ఇస్లామాబాద్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే పీవోకేను స్వాధీనం చేసుకుని తీరుతామని అమిత్ షా లాంటి బీజేపీ నేతలు పలు సందర్భాల్లో ప్రకటించారు. షరీఫ్ పార్టీ నేతృత్వంలోని పాక్ సంకీర్ణ ప్రభుత్వం భారత్‌తో స్నేహహస్తం చాచడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలను చూడాల్సిన అవసరం ఉంది.






