4 May, 2026 | 6:21 PM

అంతఃకరణ శుద్ధితో అంతిమలక్ష్యం వైపు!

30-05-2024 12:05 AM

‘పుట్టుక ఆయనది  చావు ఆయనది బ్రతుకంతా సమాజానిది’ అన్నది ఒక మహానుభావుని గురించి మనం వల్లె వేసుకునే మాట. అటువంటి కోవకే చెందే ఈ తరం నాయకుడు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. 25 సంవత్సరాల ఆయన రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే తన కోసం, తన వాళ్ళ కోసం కేటాయించిన సమయం అతి స్వల్పం. రోజులో 18 గంటలు ఆయన జీవితం ప్రజలతోనే  కొనసాగుతుంది. 

నాన్న ఆదర్శాల కోసం..

సివిల్స్ కోసం తపన పడుతున్న ఒక డిల్లీ యూనివర్సిటీ యువకుడు తండ్రి మరణంతో తప్పని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావడం కాకతాళీయమే కావచ్చు. కానీ, ప్రజా క్షేత్రాన్నే తన అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకొన్నారు. రాజకీయాన్నే పూర్తి స్థాయి వృత్తిగా ‘మనసా వాచా కర్మణా’ కొనసాగిస్తూ వచ్చారు. తండ్రి నడిచిన దారిలో, ‘తండ్రిని మించిన తనయుని’గా ఎదుగుతూ, గల్లీనుండి డిల్లీదాకా తనదైన ప్రత్యేకతను కొనసాగిస్తూ, విజయపథంలో ఆయన ముందుకు సాగుతున్న తీరు నిజంగా ‘న భూతో న భవిష్యతి’. 

అయిదుసార్లు అసెంబ్లీకి!

రాజకీయ వారసత్వాల చరిత్రను పరిశీలిస్తే విజయవంతంగా కొనసాగిన సందర్భా లు చాలా అరుదు. కానీ, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చరిత్ర అందుకు పూర్తిగా విరుద్దం. అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నిక కావడం తెలంగాణ చరిత్రలోనో అరుదైన ఘనత. అవకాశవాద రాజకీయాలకు పేరుబడ్డ నేటి రాజకీయాలలో ఒక్కసారి కూడా పక్కచూపు చూడకపోవడం ఆయన ప్రత్యేకం. జిల్లా పార్టీ అధ్యక్షునిగా, విప్‌గా, మంత్రిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, కేంద్ర కార్యదర్శిగా, రాష్ట్రాల ఇంచార్జిగా, మేనిఫెస్టో కమిటీ చైర్మెన్‌గా ఇచ్చిన ప్రతి భాద్యతనూ అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించడమే ఆయన విజయమంత్రమని చెప్పాలి. మంథని నియోజక వర్గంలోని ఆణువణువూ ఆయనకు తెలుసంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. పేరపల్లి మొదలు పలిమెల వరకూ, సుందిళ్ళ మొదలు నిమ్మగూడెం వరకూ ప్రతి నాయకుణ్ణీ పేరుపేరున పిలువ గలగడం ఆయనకు మాత్రమే సాధ్యం. నిధులన్నీ మంథనికే తరలిస్తున్నాడని నాటి ప్రతిపక్ష నాయకులు విమర్శించారంటే అందులో లేశమాత్రమైనా అబద్ధం లేదని చెప్పాలి. 

చిరునవ్వే ఆయన ఆభరణం

40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం వారి కుటుంబానికి స్వంతం. అయితేనేం, లేశమాత్రమైనా ఆయనలో గర్వం కనిపించదు. చిరునవ్వుతో పలకరించడమే తప్ప, నోరెత్తి దూషించిన దాఖలాలు లేనే లేవు. వ్యక్తిగత దూషణలకు ఆయన జీవితంలో చోటే లేదు. తన ను దూషించే వారిని పట్టించుకోకుండా ముందుకు సాగే గజరాజు దుద్దిళ్ళ. సాదా సీదాగా ఉంటూ ప్రేమతో ఎవరేం పెట్టినా తింటూ, అర్ధరాత్రులు కూడా విసుగు లేకుండా పని చేసే నాయకుడు మాత్రమే ఇంతవరకూ ఆయనలో కనిపించాడు. ఎదిగిన కొద్దీ ఒదగాలన్నదే ఆయన తత్వం. అదే ఆయనలోని విలక్షణ వ్యక్తిత్వం. చిన్న చిన్న పదవులకే ఉప్పొంగిపోయి కాలర్లు ఎగరేసే వాళ్ళు, అవినీతి కోటలు నిర్మిస్తున్న వారు కోకొల్లలుగా కనిపిస్తున్న ఈ కాలంలో ఒక్క అవినీతి మరక అన్నదే అంటకుండా సుదీర్ఘకాలం రాజకీయాలను కొనసాగించగలగడం అన్నది శ్రీధర్ బాబుకు మాత్రమే చెల్లిందనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. అందుకేనేమో, ఆయన ప్రతిష్ఠ రోజురోజుకూ పెరుగుతున్నదే తప్ప తగ్గిపోవడం లేదు. మారుమూ ల అటవీ ప్రాంతం, ఉద్యమాల కేంద్రస్థానం, నిరక్షరాస్యుల నిలయంగా పేరొం దిన ఒకనాటి మంథని ఇవాళ అన్ని రంగాలలో ముందుకు కొనసాగుతుందంటే అందుకు ప్రధాన కారణం శ్రీధర్ బాబు అకుంఠిత దీక్ష, పట్టుదలే అని చెప్పాలి. 

అంతా ఆత్మీయ అనుబంధమే

‘మహావృక్షం నీడలో చెట్టు మొలవదు’ అనేది నానుడి. అందుకు విరుద్ధంగా శ్రీధర్‌బాబు నాయకత్వంలో, ఆయన చేయూతతో వందలాదిమంది ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థానాలకు చేరుకున్నారన్నది అక్షర సత్యం. మంథని నియోజ కవర్గంలో 30 వేల పైచిలుకు ఎకరాల భూమిని నిరుపేదలకు పంచిన ఘనత దుద్దిళ్ళ వారి కుటుంబానిది. ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ముఖ్యమంత్రి సహాయనిధి కావచ్చు, స్థానిక అభివృద్ధి నిధులు కావచ్చు. ఇంకా, రోడ్డు, విద్య, వైద్యం కావచ్చు. యువతీ యువకులకు ప్రైవేట్ అవకాశాలు కావ చ్చు, ఉద్యోగార్థులకు కోచింగ్ కావచ్చు, ఏదో ఒక రూపంలో మంథని నియోజకవర్గంలోని సగానికి పైగా కుటుంబా లతో ఆయనకు ఆత్మీయ సంబంధ ప్రమే యం ఉన్నదనే చెప్పాలి. మంథనియే తన కుటుంబంగా కొనసాగుతున్న నిష్కళంక నాయకుడు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు 55వ పడిలోకి  అడుగు పెడుతున్న శుభతరుణంలో మంథని ప్రజల పక్షాన శుభా కాంక్షలు. ‘మీరు అధిరోహించే ప్రతి శిఖరం మంథని ప్రజలకు గర్వకారణం. రేపటి తరానికి మీరే టార్చ్ బేరర్ సర్’. జై హింద్.  

వ్యాసకర్త న్యాయవాది, మంథని 

సెల్: 9440449392