పదో తరగతి విద్యార్థులకు సరికొత్త మోటివేషన్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పరీక్షల పట్ల భయం, ఒత్తిడిని వీడి పూర్తి ఆత్మవిశ్వాసం కల్పించడం కోసం సరికొత్త మోటివేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య ఆదేశాల మేరకు, సోమవారం బెల్లంపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యులు విద్యార్థుల కోసం T-SAT ఛానెల్ ద్వారా ప్రత్యేక ‘మోటివేషన్ గైడెన్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారమైన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సెక్రటరీ శ్రీమతి యోగితా రాణా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పాఠశాలలోని అత్యాధునిక IFP (Interactive Flat Panel) స్క్రీన్ ద్వారా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి, నిపుణులు సూచించిన మెళకువలను తెలుసుకున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 వరకు జరగనున్నాయి. పరీక్షల మధ్య లభించే విరామ సమయాన్ని వృథా చేయకుండా, పునర్విమర్శ (Revision) కోసం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వెలుతురు వంటి అన్ని కనీస వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. విద్యార్థులు ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల విద్యాధికారి జాడి పోచయ్య ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.




