calender_icon.png 18 October, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగా వివాహ పూర్వ కౌన్సెలింగ్ కేంద్రాలు

18-10-2025 01:48:20 AM

  1. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు
  2. రూ.5 కోట్లతో రాష్ర్ట వ్యాప్తంగా 33 సెంటర్లకు కసరత్తు
  3. ప్రతి కేంద్రంలో ఒక లీగల్ కౌన్సిలర్, సైకాలజిస్టు, సోషల్ వర్కర్, హెల్పర్ 
  4. కుటుంబ వ్యవస్థ బలోపేతానికి దోహదపడే సంస్కరణాత్మక చర్య: మంత్రి సీతక్క

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి) : వివాహ సంబంధమైన ఫిర్యాదులు ఇటీవల తెలంగాణ రాష్ర్ట మహిళా కమిషన్‌కు, రాష్ర్టవ్యాప్తంగా ఉన్న సఖీ వన్ స్టాప్ సెంటర్లకు వెల్లువెత్తుతున్నాయి. వివాహ బంధంలో భిన్నాభిప్రాయాలు, పరస్పర అవగాహన లోపం, తల్లిదండ్రుల జోక్యం వల్ల న్యాయపోరాటాలు, విడాకులు, పిల్లల మానసిక వేదన వంటి అనేక సమస్యలు కుటుంబాలకు  ఎదురవుతున్నాయి.

పూర్వకాలంలో పెద్దలు, బంధువులు కలిసి యువ దంపతులకు వివాహానికి ముందే మార్గనిర్ధేశం చేసేవారు. కానీ ఆధునిక జీవనశైలిలో చిన్న కుటుంబాల పెరుగడం, పట్టణీకరణ, తరాల మధ్య బంధం తగ్గిపోవడం వల్ల ఈ మార్గదర్శకత పూర్తిగా కనుమరుగైపోయింది. కొన్ని కేసుల్లో తల్లిదండ్రులే వివాహ వివాదాల్లో పక్షాలుగా మారి సమస్యను మరింత క్లిష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దంపతులు వివాహ బంధంలో అడుగుపెట్టే ముందు ఆ బంధం బాధ్యతలను, భావోద్వేగ గాఢతను, పరస్పర గౌరవాన్ని అర్థం చేసుకునేలా ప్రత్యేక కౌన్సెలింగ్ అవసరమని తెలంగాణ  ప్రభుత్వం భావిస్తోంది.

ఇందుకు సమర్థమైన పరిష్కారంగా వివాహ పూర్వ కౌన్సెలింగ్ సెంటర్లు రాష్ర్టవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తలపెట్టారు. ఈ నేపథ్యంలో వివాహ పూర్వ కౌన్సెలింగ్ సెంటర్ల ఏర్పాటు కోసం ఫైల్‌పై ఆమె శుక్రవారం సంతకం చేశారు. ఈ కేంద్రాలు వివాహ బంధానికి సిద్ధమవుతున్న యువ జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహం ప్రారంభ దశలోనే తలెత్తే విభేదాలు తగ్గించేందుకు దోహదపడతాయి.

ప్రతి జిల్లాలో ప్రారంభ దశలో ఈ కేంద్రాలను సఖీ లేదా వన్ స్టాప్ సెంటర్లలో ఏర్పాటు చేసి, అవసరమైతే తరువాత సొంత భవనాలు ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందిన సైకాలజిస్టులు, న్యాయనిపుణులు, సోషల్ వర్కర్లు, మ్యారేజ్ కౌన్సెలర్లు వంటి నిపుణులను నియమిస్తారు. వివాహ పూర్వ కౌన్సెలింగ్ సేవలను వీరు అందిస్తారు. వీరికి ఒక్కొక్కరికి నెలకు రూ.30 వేల వేతనం ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.

సిబ్బంది జీతాలు, నిర్వాహణ తదితర అవసరాల కోసం ఏడాదికి రూ. ఐదు కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు అంచనా వేశారు. ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత ఈ సెంటర్ల ఏర్పాటు ప్రారంభం కానుంది. ఇవి కేవలం వివాహ సమస్యల నివారణకు మాత్రమే కాకుండా, సమాజ నిర్మాణానికి దోహదపడే సంస్కరణాత్మక ప్రయత్నం దిశగా ఉపయోగపడతాయని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు.