2 August, 2026 | 1:20 AM

వాణిజ్యపన్నుల శాఖ కొత్త రికార్డ్

02-08-2026 12:02 AM
  1. రాష్ట్రంలో ఒక్క జూలై నెలలోనే రూ.7,865 కోట్ల రాబడి 
  2. జీఎస్టీ వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానం 
  3. గత ఏడాదితో పోలిస్తే 19 శాతం అధికం
  4. మొదటి స్థానంలో హర్యానా 

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): పన్ను వసూళ్లలో తెలంగాణ ఆల్‌టైం రికార్డు సృష్టించింది. వాణిజ్య పన్నుల శాఖకు జూలై నెలలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ.7,865 కోట్ల ఆదాయం సమకూరింది. ఒకే నెలలో ఈ స్థాయిలో రాబడి రావడం ఇదే తొలిసారి. జీఎస్టీ వృద్ధి రేటులోనూ తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. హర్యానా తర్వాత అత్యధిక వృద్ధి సాధించిన రాష్ర్టంగా నిలిచిన తెలంగాణ.. జాతీయ సగటు 10 శాతాన్ని అధిగమిస్తూ 19 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.

రాష్ర్టంలో మెరుగైన పన్ను నిబంధనలు, ఆర్థిక కార్యకలాపాల విస్తరణ, కొత్త పెట్టుబడుల రాక, వినియోగం పెరగడం, పన్ను ఎగవేతలపై సాంకేతిక ఆధారిత చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. గతంలో ఏప్రిల్ 2026లో నమోదైన రూ.7,598 కోట్ల రాబడి అత్యధికం కాగా.. జూలైలో వచ్చిన రూ.7,865 కోట్లతో ఆ రికార్డును అధిగమించింది. జూలై 2025లో వచ్చిన రూ.6,624 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.1,241 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. జూలై నెల మొత్తం రాబడిలో జీఎస్టీ ఆదాయం రూ.4,452 కోట్లుగా ఉంది.

గతేడాది జూలైలో నమోదైన రూ.3,638 కోట్ల జీఎస్టీ ఆదాయంతో పోలిస్తే 22 శాతం పెరుగుదల కనిపించింది. రాష్ర్టంలోని పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చిన మొత్తం జీఎస్టీ రాబడి రూ.7,581 కోట్లకు చేరింది. జూలైలో నమోదైన 19 శాతం జీఎస్టీ వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటు 10 శాతంగా ఉండగా.. తెలంగాణలో రెట్టింపు వృద్ధి నమోదైందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎం.రఘునందన్‌రావు తెలిపారు.

రూ.300 కోట్ల బోగస్ ఐటీసీ యత్నాలు

మరోవైపు, జూలైలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) వ్యవహారం బయటపడింది. సరఫరా చేయకుండానే బోగస్ బిల్లుల ద్వారా రూ.300 కోట్ల మేర ఐటీసీ పొందేందుకు 165 మంది ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్లను సస్పెండ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు చేపట్టారు. సక్రమంగా పన్నులు చెల్లించే వారికి గౌరవిస్తూ.. ఉద్దేశపూర్వకంగా 

పన్ను ఎగవేసే వారిపై జీఎస్టీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని కమిషనర్ స్పష్టం చేశారు. సకాలంలో పన్నులు చెల్లించిన 4,61,276 మంది పన్ను చెల్లింపు దారులకు అధికారులు కతజ్ఞతలు తెలిపారు.