2 August, 2026 | 1:20 AM

6,307మంది చిన్నారులను కాపాడిన పోలీసులు

02-08-2026 12:00 AM
  1. జూలై 1 నుంచి 31 వరకు ‘ఆపరేషన్ ముస్కాన్ ప్రత్యేక డ్రైవ్
  2. వివరాలు వెల్లడించిన డీజీ శిఖా గోయల్

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): ‘ఆపరేషన్ ముస్కాన్ ప్రత్యేక డ్రైవ్‌లో 6,307 మంది చిన్నారులను కాపాడామని తెలంగాణ మహిళా పోలీసు భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ శనివారం తెలిపారు. జూలై 1 నుంచి జూలై 31 వరకు తెలంగాణ వ్యాప్తంగా పలు హోటళ్లు, టీ స్టాళ్లు, భవన నిర్మాణ ప్రాంతాలు, మెకానిక్ షాపులు, ఇటుకబట్టీలు, కిరాణా దుకాణాలు పలు చోట్ల తనిఖీలు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా 5,892 మంది బాలురు, 415 మంది బాలికలను రక్షించినట్లు తెలిపారు.

ఇందులో బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వంటి 15 రాష్ట్రాల నుంచి 2,860 మందిని రక్షించామని, నేపాల్ నుంచి నలభై మంది పిల్లలను రక్షించామన్నారు. తెలంగాణకు చెందిన 3,447 మంది, నేపాల్ 2,860 చెందిన వారున్నారని చెప్పారు. చిన్నారులతో పనిచేయించుకుంటున్న 1,710 మంది నిందితులను అరెస్టు చేయగా, 1,705 కేసులు నమోదు చేశామన్నారు. కనీస వేతనాల చట్టం కింద రూ. 37.95 లక్షల జరిమానా విధించామని, 5,737 మంది చిన్నారులను కుటుంబాలకు అప్పజెప్పామని, 570 మందిని శిశు సంరక్షణ కేంద్రాలకు తరలించామన్నారు. బాలల అక్రమ రవాణా, వెట్టిచాకిరిని నిర్మూలించాలనే లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని డీజీ శిఖా గోయల్ వివరించారు.