మా ఊరికి కొత్త బస్సు వచ్చే.. నెరవేరిన కొత్తపేట ప్రజల చిరకాల కళ
గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తాం: విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి,(విజయక్రాంతి): చందుర్తి మండలంలోని కొత్తపేట గ్రామానికి వేములవాడ డిపో నుంచి నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, కొత్తపేట గ్రామం ఏర్పడిన నాటి నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వారి సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి వారి సహకారంతో ఈ నూతన బస్సు సర్వీస్‌ను ప్రారంభించామని పేర్కొన్నారు. కొత్తపేట నుంచి రుద్రంగి మీదుగా వేములవాడ వరకు ప్రజలు కోరుకున్న సమయాల్లో బస్సు నడిచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గ్రామానికి బస్సు సౌకర్యం రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరిన్ని రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
త్వరలోనే గ్రామానికి నూతన రహదారి, వంతెన నిర్మాణం చేపడతామని తెలిపారు. మహిళా సమైక్య సంఘానికి రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అలాగే ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో కొత్తపేట గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ఇల్లు లేని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో కొత్తపేట గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని విప్ ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు.






