1 July, 2026 | 5:27 PM

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

01-07-2026 04:24 PM

– ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు

ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్యుత్, వైద్య, విద్యా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు. బుధవారం ఇంద్రవల్లి మండలంలోని దనోరా (బి) గ్రామంలో ఆయన విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో 11 కేవీ విద్యుత్ లైన్ సమీపంలో ఉన్న గృహాలను సందర్శించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా విద్యుత్ స్తంభాలను (పోల్స్) ఇళ్లకు సురక్షిత దూరంలో ఏర్పాటు చేయాలని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

అవసరమైన సాంకేతిక చర్యలు చేపట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం గ్రామ పరిసర ప్రాంతాల్లోని లో-లెవెల్ కల్వర్టులను పరిశీలించిన ప్రాజెక్టు అధికారి, వర్షాకాలంలో ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలగకుండా కల్వర్టుల ఎత్తును పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులను త్వరగా ప్రారంభించాలని సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్  ఏఈకి ఆదేశాలు జారీ చేశారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. తదుపరి పిట్టబొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన, వైద్యుల హాజరు, మందుల నిల్వలు, రోగులకు అందుతున్న సేవలు, పరిశుభ్రత, గర్భిణీలు మరియు చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పిట్టబొంగరం గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల హాజరు, బోధన, వసతి, భోజనం, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు, మెనూ అమలు తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని, ప్రతి విద్యార్థి విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలు చివరి గిరిజన కుటుంబం వరకు చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వెంటనే పరిష్కరించడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ పర్యటనలో  విద్యుత్ శాఖ  ఎస్ ఈ  శేష రావు  రాథోడ్, విద్యుత్ శాఖ ఏఈ  రోహిదాస్ జాదవ్, తహసిల్దార్  ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో మహేందర్, సర్పంచ్ జమున నాయక్, వివిధ శాఖల  అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, వైద్య శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.