1 July, 2026 | 5:21 PM

ఇషా గ్రామోత్సవం క్రీడలకు దరఖాస్తుల ఆహ్వానం

01-07-2026 04:11 PM

జులై 18, 19న సిద్దిపేటలో త్రోబాల్, వాలీబాల్ పోటీలు

స్థానిక విజేతలకు నగదు బహుమతులు

ఫైనల్స్‌లో రూ.5 లక్షల వరకు గెలుపు అవకాశం

సిద్దిపేట రూరల్: గ్రామీణ యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఇషా గ్రామోత్సవం–2026 త్రోబాల్, వాలీబాల్ పోటీలకు జట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జులై 18, 19 తేదీల్లో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భారతదేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడల ఉత్సవంగా పేరొందిన ఇషా గ్రామోత్సవంలో గ్రామాల తరఫున జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని కోరారు. జిల్లా స్థాయిలో విజేతలకు మొదటి బహుమతిగా రూ.10,000, రెండో బహుమతిగా రూ.7,000, మూడో బహుమతిగా రూ.5,000, నాలుగో బహుమతిగా రూ.3,000 నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.

జిల్లా స్థాయిలో విజయం సాధించిన జట్లు కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో జరిగే తుదిపోటీల్లో పాల్గొనే అర్హత పొందుతాయని, అక్కడ విజేతలకు రూ.5 లక్షల వరకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. త్రోబాల్, వాలీబాల్ జట్లు తమ గ్రామాల తరఫున ముందస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 8300030999 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు పర్షరాములు, లతా, సాయికిరణ్, సాయిచందు, సాయిహేమంత్, మహేష్ కోరారు.