ఢిల్లీ అల్లర్ల వెనుక ఆయన హస్తం!

02-05-2024 12:05:00 AM

న్యూస్‌క్లిక్ ఫౌండర్ ప్రబీర్‌పై ఢిల్లీ పోలీసుల ఆరోపణలు

8 వేల పేజీలతో ప్రబీర్ పుర్కాయస్థపై చార్జిషీటు 

ఉగ్రవాద సంస్థలకునిధులు సమకూర్చారు

రైతు నిరసనలు, ఢిల్లీ అల్లర్లకు ఆజ్యం పోశారని వెల్లడి

న్యూఢిల్లీ, మే 1: న్యూస్ క్లిక్, ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సంచలన వివరాలు వెల్లడించారు. ఈ మేరకు దాదాపు 8 వేల పేజీలతో కూడిన చార్జిషీటును ఢిల్లీ కోర్టుకు సమర్పించారు. ఆయన చట్ట వ్యతిరేక, ఉగ్ర కార్య కలాపాలల్లో పాలుపంచుకున్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. అలాగే ఉగ్రవాదులకు నిధులు కూడా సమకూర్చినట్టు తమకు తెలిసిందని పేర్కొన్నారు. న్యూస్ క్లిక్ బులెటిన్లలో కావాలనే కశ్మీర్ లేకుండా భారతదేశ మ్యాప్ టెలికాస్ట్ చేసేవారని, అక్సాయ్ చిన్‌తో కూడిన చైనా మ్యాప్ ప్రదర్శించడం వంటి దేశ వ్యతిరేక కార్యకలాపా లకు పాల్పడే వారని తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల వెనుక ప్రబీర్ ఉన్నారని, ఈ చట్టంపై తప్పుడు సమాచారాన్ని చేరవేసేవారని, నిరసనకారులకు డబ్బులు కూడా సమకూర్చినట్టు ఆరో పించారు. ఇందుకోసం న్యూస్ క్లిక్‌ను వాడుకున్నారని, ఆ సంస్థ ఉద్యోగులను కూడా ఇందుకు పురమాయించారని పేర్కొన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు, ఢిల్లీ నిరసనలకు ఆయన రాతల ద్వారా మరింత ఆజ్యం పోశారని వెల్లడించింది. 

లష్కరే తోయిబాతో సంబంధాలు

లష్కరే తోయిబా సహా పలు ఉగ్రవాద సంస్థలతో ప్రబీర్‌కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. వాటికి నిధులు కూడా సమకూర్చేవారని చెప్పారు. న్యూస్ క్లిక్‌కు రూ. 91 కోట్లు నిధులు వచ్చాయని, వాటిని ఉగ్ర కార్యకలాపాలకు వినియోగించారని ఆరోపించారు. దేశంలో భయోత్పాతం సృష్టించాలని 2016లోనే కుట్రకు ప్రణాళికలు రచించారని దుయ్యబట్టారు. మావోయిస్టులతో కూడా ప్రబీర్‌కు సంబంధాలు ఉన్నాయని వివరించింది. కాగా, ఈ కేసుపై మే 31వ తేదీన విచారణ జరగనుంది.

అంత ఆత్రమెందుకు?

కాగా, ప్రబీర్ పుర్కాయస్థను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు అంత తొందరపాటు ఎందుకని ఢిల్లీ పోలీసులను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీనికి సంబధించి ఆయన లాయర్‌కు ఎందుకు ముందే సమాచారం ఇవ్వలేదని ఆక్షేపించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఢిల్లీ పోలీసులపై పలు ప్రశ్నలు సంధించింది.