దోమలను ఇట్టే పట్టేస్తుంది..

02-05-2024 12:05:00 AM

శిశిర్ రాడార్ సంస్థ వినూత్న ఆవిష్కరణ

స్యూఢిల్లీ, మే 1: దోమల బెడద అంతా ఇంతా కాదు.. ఎన్ని ఉత్పత్తులు వాడినా వాటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. వాటిని పూర్తిగా నిర్మూలించడమూ అంత సులువు కాదు. సమస్యను మూలాల నుంచి చూడాలంటారు కదా.. దోమలు నిల్వ ఉన్న నీరు, మురికి నీటిలో గుడ్లు పెట్టి ఉత్పత్తి పెంచుకుంటాయి. అయితే మనం అన్ని పాంతాల్లో వాటిని గుర్తించడం సాధ్యం కాదు. ఆఖరికి  శాటిలైట్లు, డ్రోన్లకు కూడా వాటిని గుర్తించడం కష్టసాధ్యమే. అయితే కోల్‌కత్తాకు చెందిన శిశిర్ రాడార్ అనే స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపింది. ఏదైనా ప్రాంతంలోని మురుకు నీటిలో దోమల లార్వాలు ఉన్నాయా లేవా అనేది ఇట్టే గుర్తుపట్టేందుకు అధునాతన హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ సాంకేతికతను రూ పొందించింది. ఈ ఇమేజింగ్ పరికరాన్ని డ్రోన్లకు అనుసంధానించడం ద్వారా దోమల లార్వాలను సులువుగా గుర్తుపట్టే అవకాశం ఉందని, ప్రాథమికంగా జరిపిన పరీక్షల్లో ఇది విజయవంతమైందని శిశిర్ రాడార్ తెలిపింది.