25 June, 2026 | 2:04 AM

త్వరలోనే భూ సర్వే తదుపరి నోటిఫికేషన్

25-06-2026 01:05 AM

షాద్ నగర్, జూన్ 24 (విజయక్రాంతి): లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు ప్రాంతాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు సందర్శించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని జిల్లేడు చౌదరి గూడెం మండలం కేపీ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ఏర్పాటు చేయబోయే స్థలం సందర్శించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేపీ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణ ప్రక్రియలో భాగంగా 587 కోట్ల రూపాయలు భూసేకరణ కోసం కేటాయించి నిధులు విడుదల చేయడం ప్రభుత్వం భూసేకరణకు మేము జారీ చేసిన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, వికారాబాద్ అదనపు కలెక్టర్ వెంకట చారి పునరావాసం మరియు పునర్నిర్మాణం శాఖ కమిషనర్ శివకుమార్ నాయుడు, ఇరిగేషన్ ఈఈ దయానంద్, ఆయా జిల్లాల ఎడి సర్వే అధికారులు, షాద్ నగర్ ఆర్ డి ఓ ఎన్ ఆర్ సరిత తదితర అధికారులతో పాటు స్థానిక రైతాంగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల అదనపు కలెక్టర్లు స్థల పరిశీలన కోసం మొదటిసారి రావడంతో స్థానిక రైతాంగం పెద్ద ఎత్తున స్వాగతం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తోపాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తరలి వచ్చారు.

ఈ సందర్భంగా ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు ఈ సభలో ప్రాజెక్టు ముఖ్యమైన వివరాలను రైతాంగానికి ప్రజాప్రతినిధులకు ప్రజలకు వివరించారు. రిజర్వాయర్ నిర్మాణానికి 1510 ఎకరాల భూసేకరణ ఉంటుందని, కాలువలు ఇతర అవసరాల నిమిత్తం వాటికి వేరే భూమి అవసరం అవుతుందని తెలిపారు. 1510 ఎకరాల భూసేకరణలో షాద్ నగర్ నియోజకవర్గంలోని పద్మారం తదితర గ్రామాలలో 278.35 ఎకరాల భూమిని భూసేకరణ కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పరిగి నియోజకవర్గంలోని సైదుపల్లిలో అత్యధికంగా 800 పైచిలుకు ఎకరాల భూమి అవసరం అవుతుందని అదేవిధంగా కుల్కచర్ల మండలంలోని అల్లాపూర్ వద్ద 83. 31 ఎకరాల భూమి అవసరం ఉంటుందని తెలిపారు.