ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నిమ్మటూరి
జిల్లా సమితిలోకి ఐదుగురికి స్థానం
సత్తుపల్లి,(విజయక్రాంతి): ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటియుసి) ఖమ్మం జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీగా సత్తుపల్లి పట్టణానికి చెందిన నిమ్మటూరి రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 23, 24 వ తేదీలలో సత్తుపల్లి పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న గార్డెన్స్ లో రెండు రోజుల పాటు జరిగిన ఏఐటియుసి జిల్లా 17వ మహాసభలలో ఈ ఎన్నిక జరిగినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నిమ్మటూరి రామకృష్ణ మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సంఘటిత, అసంఘటిత రంగా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ కార్మికులకు సేవలందిస్తున్నందుకుగాను
సత్తుపల్లి నియోజకవర్గానికి, జిల్లా కమిటీలో జిల్లా సమితి సభ్యులుగా గడ్డం నరసింహారావు, బుగ్గ సుధాకర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నుండి సుధాకర్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నుండి కంచి శ్రీనివాసరావుకు నూతన కమిటీలో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజులలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఎన్నికకు సహకరించిన సంఘం రాష్ట్ర, జిల్లా బాధ్యులకు, సీపీఐ జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.
రామకృష్ణ ఎంపిక పట్ల కార్మిక సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కాగా విద్యార్థి దశ నుండే పోరాట పటిమను అలవర్చుకున్న రామకృష్ణ.. విద్యార్థి, యువజన, కార్మిక సంఘాలలో పలు పదవులను నిర్వహిస్తూ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అడుగుజాడల్లో నడుస్తూ, తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా, తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా కార్మిక వర్గానికి సేవలందిస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా మరింత సేవలు అందించి, పార్టీకి,ప్రజలకు గొప్ప పేరు తీసుకొస్తానని ఆనందాన్ని వ్యక్తం చేశారు.






