జాతీయస్థాయిలో జిల్లా కలెక్టర్ నిర్మల్ దక్కిన గౌరవం
నిర్మల్,(విజయక్రాంతి): జాతీయ వేదికపై మరోసారి నిర్మల్ జిల్లా ఖ్యాతి ప్రజరిల్లింది. జిల్లాకు రెండు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కాయి. వివిధ జిల్లా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు గాను అవార్డ్ లు నిర్మల్ జిల్లా సొంతం చేసుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ అవార్డులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, సంబంధిత శాఖలతో కలిసి స్వీకరించారు. నిర్మల్ జిల్లాకే తలమాణికమైన కొయ్య బొమ్మల పరిరక్షణ, చారిత్రాత్మక వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో కొయ్య బొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి కర్రల పెంపకం కోసం ఏర్పాటు చేసిన పొనికి వనానికి గాను లభించిన జాతీయస్థాయి స్కోచ్ అవార్డును జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మితో కలిసి స్వీకరించారు.
జిల్లాలో అమ్మరక్షిత అనే వినూత్న కార్యక్రమం ద్వారా మాతృత్వ మరణాలు తగ్గించినందుకు లభించిన మరో స్కోచ్ అవార్డును వైద్యరోగ్య శాఖ అధికారి రాజేందర్ తో కలిసి కలెక్టర్ స్వీకరించారు. అవార్డు స్వీకరణ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, మరోసారి జిల్లాకు జాతీయ వేదికలో అవార్డు రావడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. అధికారుల ఉత్తమ పనితీరుతో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసి, అవార్డు సాధనలో కృషి చేసిన అధికారులు అందరికీ ఈ సందర్భంగా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.




