ఎల్పీజీ బుకింగ్ సమయంలో మార్పు లేదు
పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల
న్యూ ఢిల్లీ, మార్చి 25: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ సమయంలో ఎలాంటి మార్పులు లేవని, నిబంధనలలో మార్పులు జరిగాయని వస్తున్న వదంతులను పట్టించుకోవద్దని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ మార్పులేవీ చేయలేదని సంయుక్త కార్యదర్శి సుజాత బుధవారం ప్రకటన విడుదల చేశారు.
35 రోజుల తరువాత గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చనే వాదన అబద్ధమని, గ్యాస్ డెలివరీ అయిన 25 రోజుల తరువాత రెండో సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చని, నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. రిఫీల్ బుకింగ్ కు సంబంధించిన పాత నిబంధనలే అమలులో ఉంటాయన్నారు. పాత నిబంధనల ప్రకారం నగరాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు మాత్రమే తదుపరి సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు.
కాగా గ్యాస్ కనెక్షన్ రకంతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న రీఫీల్ బుకింగ్ గడువులు యథాతథంగా కొనసాగుతాయని ఆ ప్రకటన పేర్కొంది. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ల కంటే 19 కేజీల వాణిజ్య సిలిండర్ల సరఫరాపైనే ఎక్కువ డిమాండ్ ఉంది. ఇటీవలే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీ కోటాను 20శాతం అదనంగా పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.




