calender_icon.png 18 September, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి వాటాలపై రాజీలేదు

18-09-2025 01:44:55 AM

ప్రజాపాలన దినోత్సవం

  1. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ అందిస్తాం 
  2. ప్రపంచంతో పోటీ పడాలన్నదే మా తపన
  3. ఎస్‌ఎల్‌బీసీని 2027 డిసెంబర్ నాటికి ప్రజలకు అంకితం చేస్తాం
  4. రూ. 24 వేల కోట్లతో మెట్రో రెండోదశ పనులు 
  5. హైదరాబాద్ తాగునీటికి వందేళ్ల ప్రణాళిక 
  6. ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి) : కృష్ణా, గోదావరి నదులు తెలంగాణకు జీవనాడులు. ఆ నదుల్లో మనకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీపడేది లేదు.. కృష్ణా జలాల్లో న్యాయపోరాటానికి సిద్ధమవుతుతన్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 904 టీఎంసీల సాధనకు ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తి చేసి ప్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తాం.. ఎన్ని అడ్డంకులు కల్పించినా వెనకడుగుకు వేసేది లేదు.. 2027 డిసెంబర్ 9 నాటికి ఎస్‌ఎల్‌బీసీని ప్రజలకు అంకితం చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. 

బుధవారం పబ్లిక్‌గార్డెన్‌లో నిర్వహించిన ప్రజా పాలన వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు గన్‌పార్కు వద్ద అమరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ .. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ సిద్దం చేస్తున్నామని, డిసెంబర్ 9న రాష్ట్ర ప్రజలకు అందిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 30 వేల ఎకరాల్లో భారత్  ప్యూచర్ సిటీకి తీసుకొస్తున్నామని, ఆధునిక ప్రపంచానికి గేట్ వేగా  ఉంటుందన్నారు. 

గాంధీ సరోవర్ ప్రాజెక్టు, గ్రీన్ ఫీల్డ్ హైవేలు, డ్రైపోర్టులు, రూ. 24 వేల కోట్లతో మెట్రో రెండో దశ విస్తరణ ప్రాజెక్టులు తదితర అభివృద్ధి పనులతో తెలంగాణ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే ప్రణాళిక తెలంగాణ రైజింగ్  2047 అని సీఎం వివరించారు.  గత పదేళ్ల నియంతృత్వ పాలనను సాయుధ పోరాట స్ఫూర్తితోనే ఓడించి ప్రజా పాలనను తెచ్చుకున్నామన్నారు. అందుకే సెప్టెంబర్ 17కు తెలంగాణ చరిత్రలో ఒక మైలు రాయి అయితే.. డిసెంబర్ 7, 2023 స్వరాష్ర్ట ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరోమైలు రాయిగా నిలుస్తుందన్నారు.  

విద్యనే మన విజయానికి వజ్రాయుధం 

అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలన్న తపనతో పని చేస్తున్నామని, ప్రతి పేదవాడి మొఖంలో ఆనందమే లక్ష్యంగా సంక్షేమ చరిత్రను తిరగ రాస్తున్నామని సీఎం వంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధిలోనే కాదు... స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం విషయంలో కూడా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా ఉంటుందన్నారు. ‘ విద్యనే మన విజయానికి వజ్రాయుధం అని మేం నమ్ముతున్నాం. గొప్ప విజన్ తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల ఆలోచన చేశాం. విద్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం’ అని సీఎం చెప్పారు.  

సంక్షేమ పథకాలు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి.. 

హరిత విప్లవం నుండి ఉచిత విద్యుత్ వరకు, రుణమాఫీ నుంచి రైతు భరోసా వరకు రైతుల కోసం రూపొందించిన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ర్టంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణాలు మాఫీ చేసి దేశంలో ఏ రాష్ర్టం చేయని విధంగా రైతులను ఆదుకున్నామన్నారు. రైతులకు 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతు భరోసా జమ చేశాం.

ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల సంక్షేమం విషయంలో రాజీ పడలేదని సీఎం స్పష్టం చేశారు. ఏడాది కాలంలోనే రూ. 1.4 లక్ష కోట్లు రైతు ప్రయోజనాల కోసం ఖర్చు చేశామని సీఎం  గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచాం. ఈ ఏడాది 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం ’ అని సీఎం చెప్పారు.

ప్రజా ప్రభుత్వం తొలి 20 నెలల్లోనే ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సుమారు 60 వేల ఉద్యోగాల భర్తీ చేశాం.  రాజీవ్ గాంధీ సివిల్స్ ఆభయ హస్తం ద్వారా రూ. లక్ష  ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన 180 మందికి తెలంగాణ అభ్యర్థులకు ఆగస్టు 11న  ఈ ఆర్థిక సహాయం అందించాం.ఆర్థిక సహాయం పొందిన వారిలో ఇప్పటి వరకు 10 మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావడం తెలంగాణకు గర్వకారణమన్నారు.  

కోటి మంది అడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో.. 

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి తెలంగాణ వీర వనితలు పోరాటంలో ముందుడి నాయకత్వ పటిమను చాటారు. ‘మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి’ అనే నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మేం చేపడుతున్న కార్యక్రమా లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. 

ఇందిరా మహిళాశక్తి పాలసీలో భాగంగా నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ద్వారా ఆరు నెలల్లో రూ.15.50 లక్షల లాభాలు ఆర్జించింది. ఖమ్మం “మహిళా మార్ట్‌” విజయవంతంగా నడుస్తోంది. రాష్ర్టంలో మరికొన్ని మహిళ మార్ట్ లను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం ’ అని  తెలిపారు. 

అమరుల స్ఫూర్తితో ప్రజా పాలన : సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయ సాధనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ , హైదరాబాద్ మేయర్  గద్వాల విజయలక్ష్మి, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.