14 March, 2026 | 3:36 AM

సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌పై అవిశ్వాస తీర్మానం

14-03-2026 01:01 AM
  1. ‘ఇండియా కూటమి’ ఆధ్వర్యంలో 193 మంది ఎంపీల సంతకాలు

కూటమిలోని ‘ఆప్’ ఎంపీలు సైతం సంతకాలు

న్యూఢిల్లీ, మార్చి 13: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు శుక్రవారం ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో 193 మంది ఎంపీలు నోటీసులపై సంతకాలు చేశారు. సంతకాలు చేసిన వారిలో లోక్‌సభ నుంచి 130 మంది ఉండగా, రాజ్యసభ నుంచి 63 మంది సభ్యులు ఉన్నారు. ఆ కూటమిలో భాగస్వామి కాని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు సైతం నోటీసుపై సంతకాలు చేయడం చర్చకు దారితీసింది. సభలోకి అవిశ్వాస తీర్మానం వస్తే.. స్వతంత్ర భారత్ చరిత్రలో ఒక సీఈసీపై అవిశ్వాసం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అవుతుంది.

ఇండియా కూటమి స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, అది వీగిపోయి భంగపాటుకు గురైన కొద్దిరోజుల్లోనే, సీఈసీపై అవిశ్వాసానికి పూనుకోవడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. 

సీఈసీ ఆరోపణలివి

‘సీఈసీ జ్ఞానేష్‌కుమార్ తన విధుల్లో పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల అక్రమాలపై దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు.  ఇష్టారీతిన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు. అధికార పార్టీ బీజేపీకి మేలు చేసేలా రాష్ట్రాల్లో ‘సర్’ అమలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఎన్నికల కమిషన్ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉన్నాయి’ అని రాసి ఉన్న నోటీసులపై 193 మంది సభ్యులు సంతకాలు చేశారు.

అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే?

రాజ్యాంగంలోని అధికారం 324(5) ప్రకారం, ఒక సీఈసీని ఆ పదవి నుంచి తొలగించాలంటే, ముందుగా అవిశ్వాస తీర్మానం నోటీసులను ఉభయసభల్లో ప్రవేశపెట్టాలి. లోక్‌సభలో స్పీకర్, రాజ్యసభలో అధ్యక్షుడు ఆ నోటీసులను ఆమోదించాలి. ఆ తర్వాత, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక హైకో ర్టు ప్రధానన్యాయమూర్తి, ప్రముఖ న్యాయకోవిదుడితో కూడిన ముగ్గురు సభ్యుల కమి టీ అవిశ్వాసంపై విచారణ జరుపుతుంది.

సీఈసీపై వచ్చిన ఆరోపణలు నిజమని తేల్చి న తర్వాతే, ఉభయ సభల్లో ఓటింగ్ జరుగుతుంది. అక్కడ ఉభయ సభల్లోనూ రెండింట మూడు వంతుల మెజార్టీ సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి ఉన్న బలంతో ఈ తీర్మానం నెగ్గడం కష్టమే అయినప్పటికీ, ఎన్నికల కమిషన్ పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ లేవనెత్తడమే విపక్షాల ప్రధాన ఉద్దేశమనేది స్పష్టమవుతున్నది.