లక్ష కోట్లతో ‘ఆర్థిక స్థిరీకరణ నిధి’
- నిధితో బాహ్య సంక్షోభాల నుంచి దేశానికి ఆర్థిక భరోసా
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్
లోక్‌సభ వేదికగా ప్రకటన
న్యూఢిల్లీ, మార్చి 13: ప్రపంచవ్యాప్తంగా తలెత్తే అనూహ్యమైన ఆర్థిక సంక్షోభాలు భారతదేశాన్ని ప్రభావితం చేయకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల నిధులతో ‘ఆర్థిక స్థిరీకరణ నిధి’ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిధి కోసం ప్రస్తుత అనుబంధ పద్దుల్లో సుమారు 57,381 కోట్ల కేటాయించామని మంత్రి వివరించారు. మిగిలిన మొత్తాన్ని వివిధ శాఖల్లో పొదుపు చేసి సమకూరుస్తామని చెప్పారు. లోక్‌సభ వేదికగా ఆమె మాట్లాడుతూ.. సుమారు రూ.2 లక్షల కోట్ల అదనపు నికర వ్యయం కోసం తమ ప్రభుత్వం పార్లమెంట్ అనుమతి కోరినట్లు వెల్లడించారు.
ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూనే ద్రవ్యలోటును నియంత్రణలో ఉంచుతామని ధీమా వ్యక్తం చేశారు. గత ఫిబ్రవరిలో అంచనా వేసినట్లుగా 2025- ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును స్థూల జాతీయోత్పత్తిలో 4.4 శాతానికి పరిమితం చేస్తామని పునరుద్ఘాటించారు. అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని వెల్లడించారు. గతంలో దేశానికి ఇలాంటి ప్రత్యేక నిధి లేదని, కేవలం చమురు ధరల స్థిరీకరణ కోసం మాత్రమే కొన్ని నిధులు ఉండేవని గుర్తుచేశారు.




