రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం
- పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి నోటీసు
- ప్రవేశపెట్టిన ఇండియా కూటమి
- 70 మంది సంతకాలు చేశారంటున్న కాంగ్రెస్
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియ కూటమి మంగళవారం అధికారికంగా అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించిందని కాంగ్రెస్ ఎం పీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. ప్రతిపక్షాల పట్ల చైర్మన్ పక్షపాత వైఖరిని అవలంభిస్తున్నారని కూటమి నేతలు ఆరోపించారు. అవిశ్వాస తీర్మానానికి టీఎంసీ, ఎస్పీ, ఆప్, డీఎంకే సీపీఐ, జేఎంఎం, ఆర్జేడీ, సహా కూటమిలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.
తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంటుంది. తీర్మానంపై 70 మంది ఎంపీలు సంతకాలు చేశా రని కాంగ్రెస్ నేత రణజీత్ రంజన్ మీడియా తో మాట్లాడుతూ చెప్పారు. తీర్మానాన్ని రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు కూటమి నేత లు అందించారు. అయితే రాజ్యసభలో ప్రతిపక్షాలకు స్పష్టమైన మెజారిటీ లేకపో వడంతో చైర్మన్‌ను తొలగించే అవకాశం లేద ని, తీర్మానం వీగిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఆగస్టులో కూ డా రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలని కూటమి పార్టీలు భావించాయి.
50శాతం మంది ఆమోదించాలి
రాజ్యసభ రూల్స్ ప్రకారం చైర్మన్‌ను తొలగించే తీర్మానాన్ని సభ సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. తీర్మానంపై ఓటింగ్ జరిగిన రోజు కనీసం 50% మంది సభ్యుల ఆమోదం అవసరం. ఒకవేళ తీర్మానం ఆమోదించబడితే.. తుది ఆమోదం కోసం లోక్‌స భలో సాధారణ మెజారిటీని తీర్మానం పొం దాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బి),92, 100 సెక్షనల్లో వివరించబడింది.
సభలోకి తీర్మానం వచ్చేనా..
ప్రొసీజర్ ప్రకారం చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలని రాజ్యాం గం చెబుతోంది. అయితే ఈ శీతాకాల పార్లమెంట్ సెషన్ డిసెంబర్ 20తో ముగుస్తుం డడంతో తీర్మానం అసలు సభలోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కేవలం చైర్మన్ తీరును దేశ ప్రజల ముందు ఎండగట్టాలనే వ్యూహంతోనే అవిశ్వాస తీర్మాన అంశాన్ని ఇండియా కూటమి తెరపైకి తీసుకువచ్చిందని వార్తలు వస్తున్నాయి.
తీర్మాన నేపథ్యం
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచి ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంటున్నది. భారత వ్యతిరేకి, యూఎస్ బిలియనీర్ జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్ నేత సోనియాగాంధీకి, కాంగ్ర స్‌కు ఆర్థిక సంబంధాలున్నాయని బీజేపీ ఆరోపించింది. మోదీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు అమెరికా డీప్‌స్టేట్‌లో కీలకవ్యక్తిగా ఉన్న సోరోస్‌తో కాంగ్రెస్‌కు ఏంటి సం బంధమని బీజేపీ నేతలు ప్రశ్నించారు.దీనిపై సోనియా సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.
దీనిపై రాజ్యసభలో చర్చకు ధన్‌ఖర్ అనుమతించడంతో వివా దం మొదలైంది. ఈ క్రమంలోనే అదానీ గ్రూప్‌ను మోదీ, బీజేపీ కాపాడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించడంతో మంగళవారం సమావేశాలకు అంతరాయం కలిగింది. అదే సమయంలో అదానీపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టినా ఆయన నిరాకరించారు. తమ నోటీసులను తిరస్కరించి, చర్చకు అధికార సభ్యులకు ఎలా అనుమతి ఇస్తారని కాంగ్రెస్ ప్రశ్నించింది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గందరగోళం ఏర్పడిన కొద్దిసేపటికే అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించారు. ఈ నేపథ్యంలో సభలో తీవ్ర వాగ్వాదం జరగడంతో ఉభయసభలు వాయిదా పడ్డాయి.
అవిశ్వాసం విచారకరం: రిజిజు
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం విచారకరమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ చైర్మన్‌ను చూసి ప్రభుత్వం గర్విస్తోందన్నారు. ఆయన ఎవరిపట్ల పక్షపాతం లేకుండా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. రాజ్యసభలో ఎన్డీయేకు మెజార్టీ ఉందని తెలిపారు. తీర్మానం తిరస్కరించబడుతుందని ఆయన పేర్కొన్నారు.






