calender_icon.png 10 February, 2026 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం?

10-02-2026 12:00:00 AM

  1. ప్రతిపక్షాల సంచలన నిర్ణయం
  2. స్పీకర్ వ్యవహార శైలిపై తీవ్రమైన అభ్యంతరాలు
  3. ఏఐసీసీ చీఫ్ ఖర్గే నేతృత్వంలో పలు పార్టీల సమావేశం
  4. కాంగ్రెస్ నేతృత్వంలో 1౦౦ మంది ఎంపీల సంతకాల సేకరణ
  5. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్‌కు నోటీసులిచ్చే అవకాశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. న్యూఢిల్లీలో సోమవారం ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో టీఎంసీ, డీఎంకే, వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) తదితర పార్టీల ఎంపీలు భేటీ అయ్యారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.

ప్రస్తుతం జరుగుతున్న రెండో విడత బడ్జెట్ సమావేశాలలో ఈ తీర్మానాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే 20 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాల్సి ఉండటంతో సమావేశాల చివరి దశలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. స్పీకర్ అనుసరిస్తున్న తీరుపై విపక్షాల సభ్యులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీకి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నారు.

అలాగే సభలో మహిళా ఎంపీల పేర్లను స్పీకర్ ప్రస్తావించిన తీరుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని వాదిస్తున్నారు. ట్రెజరీ బెంచీలకు చెందిన కొందరు సభ్యులకు స్పీకర్ ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎనిమిది మంది విపక్ష ఎంపీలను సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడుతున్నారు. గత వారం చైనా చొరబాటు అంశంపై రాహుల్‌గాంధీ ప్రసంగిస్తున్నప్పుడు అధికార పార్టీ సభ్యులు అడ్డుకున్నారని దుయ్యబడుతున్నారు.

అలాగే ఈనెల 5న ప్రధాని మోదీ సభకు రావొద్దని సలహా ఇచ్చానని, మోదీపై దాడి జరిగే అవకాశం ఉందని తనకు ముందే సమాచారం అందిందని స్పీకర్ పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ సీటు వద్దకు కాంగ్రెస్ ఎంపీలు వెళ్తున్నారని ఊహాజనితంగా స్పీకర్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు విపక్షాలకు కనీసం 100 మంది ఎంపీల సంతకాలు అవసరం. ప్రస్తుతం విపక్షాలు ఆ సంతకాల సేకరణలో ఉన్నట్లు తెలుస్తోంది. 

స్పీకర్‌కు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి తమ నుంచి ముప్పు పొంచి ఉందనిలోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ మహిళా ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఎంపీ జ్యోతిమణితో కూడిన మహిళా ఎంపీల బృందం ఈ మేరకు సోమవారం స్పీకర్‌కు లేఖ సమర్పించింది. ‘స్పీకర్ కాంగ్రెస్ ఎంపీలపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమైనవి. నిరాధారమైనవని. ఆ వ్యాఖ్యలు మా గౌరవానికి భంగం కలిగించాయి. అధికార పార్టీ ఒత్తిళ్ల నేపథ్యంలోనే స్పీకర్ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను పూర్తి సెషన్ సస్పెండ్ చేయడం ప్రజాస్వామిక విరుద్ధం. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిర, రాజీవ్‌గాంధీపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీలపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అనేది మహిళా ఎంపీల లేఖలోని సారాంశం.

సభ రేపటికి వాయిదా

లోక్‌సభలో సోమవారం స్పీకర్ ఓం బిర్లా వ్యవహార శైలిపై ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే ఇండియా కూటమి సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ తాము ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని వెంటనే చర్చకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని మాట్లాడకుండా అడ్డుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

అధికార పక్షం కూడా విపక్షా ల తీరును తప్పుబట్టడంతో సభలో గందరగోళం చోటుచేసుకుంది. సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ పదేపదే కోరి నా ఫలితం లేకపోయింది. సభను నిర్వహించడం కష్టంగా మారడంతో స్పీకర్ మొదట సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు.

ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యే కొన్ని బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చివరకు గందరగోళం తగ్గకపోవడంతో స్పీకర్ సభను మంగళవారం ఉదయం 11గంటలకు వాయి దా వేస్తున్నట్లు ప్రకటించారు. అటు రాజ్యసభలో రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగానికి అనుమతి లభించకపోవడంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.