10-02-2026 01:52:41 AM
రాయ్‌పూర్, ఫిబ్రవరి 9: విధ్వంసమే మావోయిస్టుల సిద్ధాంతం. మావోయిజం ఏ సమాజానికీ మేలు చేయలేదు. కొలంబియా, పెరూ, కంబోడియా వంటి దేశాల్లో ఇలాంటి భావజాలం కేవలం విధ్వంసాన్నే మిగిల్చింది. వచ్చే నెల మార్చి 31 నాటికి దేశం నక్సలిజం విముక్త భారత్ అయి తీరుతుంది. బస్తర్ ప్రాంతంలోని మావోయి స్టులు ఇకనైనా ఆయుధాలు వీడాలి. జనజీవన స్రవంతిలో కలవాలి’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు.
సోమవారం ఆయన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో పర్యటించారు. జగదల్‌పూర్‌లో రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన ‘బస్తర్ పండమ్ వేడుకల ముగింపు వేడుకకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తుపాకులు బస్తర్ గుర్తింపు కాదని, ఇక్కడి సంస్కృతి, వారసత్వమే బస్తర్ సొగసు అని అభివర్ణించారు. గతంలో తుపాకుల మోత వినిపించిన చోట ఇప్పుడు పాఠ శాలల గంటలు వినిపిస్తున్నాయని కొనియాడారు.
బస్తర్ పండమ్ వంటి ఉత్సవాలు గిరిజన కళాకారులకు కొత్త గుర్తింపు ఇస్తున్నాయని ప్రశంసించారు. 2027 డిసెంబర్ నాటికి బస్తర్ ప్రాంతంలోని ప్రతి గ్రామానికి విద్యుత్, మొబైల్ కనెక్టివిటీ అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వేడుకల్లో సీఎం విష్ణుదేవ్ సాయ్, డిప్యూటీ సీఎం శర్మ, ఇతర మంత్రులు పాల్గొన్నారు.