4 March, 2026 | 3:12 AM

చర్చల్లేవ్.. చాలా ఆలస్యమైంది !

04-03-2026 01:11 AM
  1. సమయం మించిపోయింది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ చర్చల ప్రతిపాదన తిరస్కరణ 

వాషింగ్టన్, మార్చి ౩: ‘ఇరాన్‌తో ఎలాంటి చర్చల్లేవ్.. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సమయం మించిపోయింది. ఆ దేశం మాతో చర్చలకు ప్రతిపాదించింది. నేను ఆ ప్రతిపాదనను తిరస్కరిం చాను’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ‘సోషల్ ట్రూత్’ ద్వారా స్పష్టం చేశారు. ఇరాన్‌పై మరింత భీకర దాడులు చేస్తామని తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్‌తో కలిసి తమ దేశం జరిపిన దాడుల్లో ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం, గగనతల రక్షణ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని వెల్లడించారు. ఆ దేశ నాయకత్వమూ తుడిచి పెట్టుకుపోయిందని వివరించారు.

అంతకుముందు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయన మాట్లాడుతూ. తమ దేశం ఇరాన్‌లోని చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. యుద్ధం ఎక్కువ కాలం జరగాలని తాము కోరుకోవడం లేదని తెలిపారు. ఇరాన్ నాయకత్వ బాధ్యతలను ఎవరు తీసుకుంటారనే అంశం తమకు పట్టదని పేర్కొన్నారు. యుద్ధంలో ఇప్పటివరకు ఆరుగురు అమెరికన్ సైనికుల మృతి చెందారని, వారి మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినబూనారు. ఆ ప్రతీకారం ఎలా ఉంటుందనేది త్వరలోనే ప్రపంచానికి తెలుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు, ఇరాన్‌పై చేపట్టిన సైనిక దాడులపై ట్రంప్ తాజాగా అమెరికా కాంగ్రెస్‌కు అధికారికంగా లేఖ రాశారు. గత నెల 28 నుంచి ప్రారంభమైన దాడులు అమెరికా ప్రయోజనాలను కాపాడడం కోసమేని తెలిపారు. దాడుల్లో ఇరాన్ క్షిపణి కేంద్రాలు, కమాండ్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నామని, ఎక్కడా అమెరికా భూతల దళాలను వాడలేదని వివరించారు. దాడులకు అవసరమైతే భూతల దళాలను రంగంలోకి దించుతామని స్పష్టం చేశారు.